వైసీపీ అధినేత జగన్.. తాను చేస్తున్న రాజకీయం మరెవరూ చేయరు అని అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు కూడా మారుతున్నారు. పాలను పాలలా, నీళ్లను నీళ్లలానే చూస్తున్నారు. దీనిని అవగతం చేసుకుంటేనే రాజకీయాల్లో కొన్నాళ్లు మనగలుగుతారు. లేకపోతే సర్దేసుకునే పరిస్థితి ఖాయం. ఇప్పుడు ఇదే ఏపీలోనూ జరుగుతోంది. “ప్రజలు అన్నీ గమనిస్తున్నా రు” అని రాజకీయాల్లో ఉన్న నాయకులు తరచుగా చెబుతుంటారు.
ఇది నిజం కూడా! కానీ ప్రజలు గమనించిన దానికి అనుగుణంగా నాయకులు నడుచుకోవాలి. ముఖ్యంగా పార్టీల అధినేతలు వ్యవహరించాలి. ఈ విషయంలోనే జగన్ తప్పులపై తప్పులు చేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే అన్న చందంగా వ్యవహరించి నష్టపోయారు. ఇది తెలుసుకుని ప్రజల నాడిని గుర్తెరిగితేనే తప్ప జగన్‌కు ఫ్యూచర్ లేదు. ఇది వాస్తవం. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. ప్రజలు ఒకప్పుడు ఉన్న మానసిక స్థితిలోనే ఇప్పుడు ఉన్నారన్న వాదనలో జగన్ ఉన్నారు.
కానీ ప్రజలు ఎప్పుడో మారారు. పార్టీలను చూడడం లేదు. మంచిని, తమకు ప్రయోజనకరం అనుకున్న వాటిని మాత్రమే చూస్తున్నారు. అదే గత ఎన్నికల్లోనూ నిజమైంది. ఒకప్పుడు గత ప్రభుత్వాలు తెచ్చిన పథకాలను ఎత్తేసినా పరవాలేదనుకున్న ప్రజలు ఇప్పుడు అలా లేరు. పథకం ఏదైనా మంచి ఉంటే, తమకు మేలు చేస్తుందని అనుకుంటే కొనసాగించాలనే కోరుతున్నారు. కానీ జగన్ అన్నా క్యాంటీన్ వంటి కీలక కార్యక్రమాన్ని ఎత్తేశారు. ప్రజాభవన్‌ను కూలదోశారు. అమరావతిని అటకెక్కించారు. ఈ పరిణామం ఆయనకు పెద్ద మైనస్ అయింది.
ఇక ఇప్పుడు జరుగుతున్న విషయానికి వస్తే, అసెంబ్లీకి జగన్ వెళ్లాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. ఇది ప్రత్యర్థులు చెబుతున్న మాట కాదు. ఆన్‌లైన్ ఛానెళ్లు చేస్తున్న సర్వేలు చెబుతున్న మాట. జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకునే వారు ఎక్కువగా ఉన్నారు. అదేసమయంలో ప్రజల మధ్యకు రావాలని కూడా కోరుతున్నారు. ఈ రెండు విషయాల్లోనూ జగన్ పట్టుబట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా భీష్మించుకుంటున్నారు. ప్రజల మధ్యకు వస్తే ఏదో జాతరలా వస్తున్నారు. ఇది సరికాదు. ప్రజల నాడి తెలుసుకుని వారికి అనుగుణంగా రాజకీయాలు మలుచుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం జగన్‌కు ఎంతైనా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates