మలయాళ నటి, జర్నలిస్ట్‌గా కూడా పనిచేసిన రినీ ఆన్ జార్జ్ సంచలన ఆరోపణలు చేసి కేరళ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని, హోటల్‌కు రావాలని ఆహ్వానించాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఆ నేతకు మరిన్ని అవకాశాలు ఇచ్చారని రినీ వాపోయారు.
రినీ మాట్లాడుతూ, “తమ కుటుంబంలోని మహిళలను కాపాడుకోలేని రాజకీయ నాయకులు, ఇతర మహిళలను ఎలా రక్షిస్తారు?” అని ప్రశ్నించారు. తన అనుభవాలను బహిర్గతం చేయడానికి కారణం ఇటీవలే సోషల్ మీడియాలో పలువురు మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఎవరూ బయటకు రాకపోవడమేనని ఆమె వివరించారు. “నేను మాట్లాడకపోతే, ఇంకా చాలా మంది మౌనంగా ఇలాగే బాధపడతారు అనిపించింది” అని రినీ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ఈ ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ పేరు బయటకు రావడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. బీజేపీ కార్యకర్తలు రాహుల్ మంఖూటతిల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు రచయిత హనీ భాస్కరన్ కూడా ఫేస్‌బుక్ ద్వారా రాహుల్‌పై తన అనుభవాన్ని బహిర్గతం చేశారు.
హనీ మాట్లాడుతూ, రాహుల్ తనకు పలుమార్లు సోషల్ మీడియాలో సందేశాలు పంపాడని, మొదట్లో ప్రయాణానికి సంబంధించిన మాటలతో ప్రారంభమైనా తర్వాత అసభ్యంగా మారాడని పేర్కొన్నారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా తన గురించి చెడుగా మాట్లాడాడని, తనే మొదలుపెట్టినట్లు తప్పుడు ప్రచారం చేశాడని హనీ ఆరోపించారు. ఇప్పటికే పలువురు మహిళలు యూత్ కాంగ్రెస్‌లో నుంచి కూడా రాహుల్‌పై ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని హనీ భాస్కరన్ ఆరోపించడం మరింత చర్చనీయాంశమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates