గోవింద గోవింద‌: ఉద‌యం టికెట్.. సాయంత్రానికే శ్రీవారి ద‌ర్శ‌నం!

అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, క‌లియుగ దైవం.. తిరుమ‌ల శ్రీవారి ఈష‌ణ్మాత్ర ద‌ర్శ‌నం కోసం రోజుల త‌ర‌బ‌డి వేచి ఉండే ప‌రిస్థితికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చెక్ పెట్ట‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీవారి ద‌ర్శ‌నం.. వివిద ఆర్జిత సేవ‌లు చేసుకోవాల‌ని ప‌రి త‌పించిపోయే భ‌క్తుల‌కు.. ద‌ర్శ‌నం నుంచి సేవ‌ల వ‌రకు వేచిచూడాల్సిన ప‌రిస్థితి ఉన్న విష‌యం తెలిసిందే. తిరుమ‌ల దేవ‌దేవుని ద‌ర్శ‌నం.. దుర్ల‌భ‌మ‌నే మాట కూడా నానుడిగా మారిపోయింది. అలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు వ‌డివ‌డిగా.. శ్రీవారిని ద‌ర్శించుకునే అవ‌కాశాన్ని తిరుమ‌ల తిరుప‌తి పాల‌క‌మండలి బోర్డు భ‌క్తుల‌కు క‌ల్పిస్తోంది.

ఉద‌యం టికెట్ తీసుకుని.. మ‌ధ్య‌లో భోజ‌నం చేసి.. కొద్దిసేపు కుదిరితే విశ్రాంతి తీసుకుని.. సాయంత్రానికి శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకునే విధానాన్ని త్వ‌ర‌లోనే ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు తెలిపారు. దీనివ‌ల్ల భ‌క్తుల‌కు.. విలువైన స‌మ‌యం వృథాకాకుండా ఉండ‌డంతోపాటు.. తిరుమ‌ల‌లో ర‌ద్దీ కూడా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు .. శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చి.. రోజుల త‌ర‌బ‌డి వేచి ఉండ‌డంతో హోట‌ళ్ల అద్దెల‌కు, భోజ‌నాల‌కు వెచ్చించే సొమ్ములు కూడా మిగులు తాయ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు.. తిరుమ‌ల‌లో మ‌రిన్ని మార్పులు జ‌ర‌గ‌నున్నాయ‌ని కూడా నాయుడు తెలిపారు.

మార్పులు ఇవే..

1) త్వ‌ర‌లోనే ఉద‌యం టికెట్ తీసుకుని సాయంత్రానికి ద‌ర్శ‌నం చేసుకునే వెసులుబాటు.

2) ఏఐ సాంకేతిక వ్య‌వ‌స్థ ద్వారా భ‌క్తుల‌కు మ‌రింత శ్రీఘ్ర ధ‌ర్శ‌నం.

3) అన్యమత ఉద్యోగుల తొల‌గింపు.. లేదా వీఆర్ ఎస్‌కు ప్రోత్సాహం.

4) క‌డ‌ప‌లోని ఒంటిమిట్ట కోదండ రామాల‌యంలో నిరంత‌ర అన్న‌దానం.

5) తిరుమ‌ల‌లో హోట‌ళ్లు నిర్మించుకునేందుకు ఈ-టెండ‌ర్ల విధానం అమ‌లు.

6) భ‌క్తుల కోసం తిరుమలలో త్వరలో కొత్త క్యాంటీన్ల ఏర్పాటు.

7) శ్రీవారి పేరిట జ‌రిగే సైబ‌ర్ మోసాల‌కు చెక్ పెట్టేలా అధునాత‌న వ్య‌వ‌స్థ‌.