ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులకు.. వెలుగులోకి వచ్చిన అక్రమాలకు.. ఇప్పుడు చాలా మంది నాయకులు, ప్రముఖులు కూడా బలవుతున్నారు. తాజాగా ‘వ్యూహం’ సినిమా నిర్మాత.. దాసరి కిరణ్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు.. కిరణ్‌ను కొద్ది సేపు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి.. విజయవాడకు తరలిస్తున్నారు. వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ సంస్థ నుంచి సొమ్ములు అందాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై కూటమి సర్కారు కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది.
అసలేంటి వివాదం?
గత ఏడాది ఎన్నికలకు ముందు.. వైసీపీ విజయాన్నికాంక్షిస్తూ.. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ‘వ్యూహం’ పేరుతో వ్యూహం-1, వ్యూహం-2 సినిమాలను రూపొందించారు. దీనిలో టీడీపీ, జనసేన పార్టీలను విలన్‌లుగా చూపిస్తూ.. జగన్ వ్యూహానికి వారు చిత్తవుతారన్న సారాంశంతో మొత్తం కథను నడిపించారు. అయితే.. ఈ సనిమా వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు పెట్టగా.. దీనిని విచారిస్తున్నారు. ఇటీవల ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మను సుమారు 12 గంటలపాటు విచారించారు.
ఈ సినిమాకు సొమ్ములు ఎలా వచ్చాయి? ఎవరు తీయమన్నారు? దీనివెనుక ఎవరు ఉన్నారు? అనే కీలక అంశాలను ఆయన నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వర్మ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌పై కూడా కేసు పెట్టి.. ఆయనను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి వ్యూహం-1, వ్యూహం-2 సినిమాలు.. రెండూ కూడా సినిమా హాళ్లలో సక్సెస్ సాధించలేదు. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫైబర్ నెట్ ద్వారా.. ఇళ్లలో ఉండే టీవీల్లో ఈ సినిమాలను ప్రసారం చేశారు. దీనిపై కూడా మరో కేసు ఉంది.
ఇలా ప్రసారం చేసినందుకు.. ప్రభుత్వం నుంచి నిర్మాతకు సొమ్ములు అందాయి. ఈ విషయమే కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఫైబర్ నెట్ చైర్మన్‌గా నియమితులైన జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని.. దీనిని వడ్డీతో సహా రాబడతామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణనుముమ్మరం చేశారు. ఇప్పటికే దర్శకుడు వర్మనుప్రశ్నించిన తర్వాత.. ఇప్పుడు తాజాగా నిర్మాతను అరెస్టు చేశారు. దీంతో సొమ్ముల విషయంపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates