కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. తెలుగు వారైన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఈ పోస్టుకు ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం లో జన్మించిన సుదర్శన్ రెడ్డి హైదరాబాదులోనే విద్యను కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు.
తర్వాత కాలంలో న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా కూడా హైకోర్టులో సేవలు అందించారు. సామాన్యులకు పెద్దపీట వేశారన్న పేరు తెచ్చుకున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2007 నుండి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలోనూ పలు కీలక తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ అనంతరం గోవా తొలి లోకాయుక్తగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. నల్సార్ లా కాలేజీలో ఆయన పలు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు.
తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంపై న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తొలిసారి తెలంగాణ వాసికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం రావడం సంతోషకరమని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఏకగ్రీవంగా బలపరుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన కొద్ది సమయంలోనే ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం విశేషం.
కేవలం పోటీనే!
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటికీ ఆయన గెలుపు కష్టమనే అభిప్రాయం పార్లమెంటు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉభయ సభల్లో అధికార ఎన్డీయే పక్షానికే బలమైన మద్దతు ఉంది. దీంతో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం ఖాయమని అంటున్నారు. అయితే ఇండియా కూటమి మాజీ న్యాయమూర్తిని ఎంపిక చేయడం వల్ల ఎన్నికల్లో పోటీ తప్పదని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates