వివేకా కుమార్తెకు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు భారీ ఊరట లభించింది. సునీత సహా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, అప్పట్లో ఈ కేసును విచారించిన సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌లపై కడప పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వీటిని సవాల్ చేస్తూ సునీత దంపతులు సహా రాంసింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై పలు మార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా వాటిని కొట్టి వేయడంతో సునీత దంపతులు సహా రాంసింగ్‌కు ఊరట లభించింది.

ఏంటా కేసు?

వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కొందరిని బలవంతంగా అరెస్టు చేస్తున్నారని, వారిని ఈ కేసును ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంటూ అప్పట్లో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చారు. ఇక సునీత దంపతుల ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదాల కారణంగానే హత్యకు ప్రేరేపించారని, తమను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపైనా కేసు నమోదైంది. ఈ కేసులను తాజాగా సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

అవినాష్ బెయిల్ రద్దు పై..

వివేకా కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురు బెయిల్‌పై ఉన్నారని, వీరి బెయిల్‌ను రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అదేవిధంగా కేసు దర్యాప్తు పూర్తి అయిందని సీబీఐ అధికారులు గత విచారణ సమయంలో చెప్పడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విధించిన గడువు కారణంగానే వారు విచారణ పూర్తయిందని కోర్టుకు తెలిపారు.

వివేకా హత్య కేసులో తేలాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని లూథ్రా తెలిపారు. ఈ హత్యను గుండెపోటుగా ప్రచారం చేశారని, దీని వెనుక కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా హత్య వెనుక అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు. సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు.