డిజైన్లు అధిరిపోవాలి: అమ‌రావ‌తిపై చంద్ర‌బాబు

ఏపీ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు సాదా సీదా డిజైన్లు కాదు.. అద్భుత మైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. సోమవారం అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీల‌క‌మైన‌ 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు స్పెష‌ల్ పర్స‌స్ వెహిక‌ల్ ఏర్పాటుకు సీఆర్డీఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలిపింది. అలాగే, రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రోప్ వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు చేయ‌నున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్కు ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్(భూ సమీక‌ర‌ణ‌) కింద భూ సమీకరణ చేయాల‌నిచంద్ర‌బాబు నిర్దేశించారు.

మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద 78 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు భూ సమీకరణ చేయాలన్న సీఆర్డీఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఎల్పీఎస్ నిబంధనలకు కూడా ఆమోదం తెలిపారు. ఏర్పాటు చేయ‌నున్న‌ గోల్డ్ క్లస్టర్ వద్ద ప్రత్యేక ఎకో సిస్టం వచ్చేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రూ.5 వేల కోట్ల మేర పెట్టు బడులు వచ్చే అవకాశం ఉందని.. 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఆర్డీఏ పేర్కొంది.

అమరావతి పరిధిలోని 29 గ్రామ పంచాయితీల్లో డ్రెయిన్లు, నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎల్పీఎస్ జోన్స్ క్రిటికల్ ఇన్ ఫ్రా అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ కింద రూ.904 కోట్లతో పనులు చేపట్టేందుకు సీఎం చంద్ర‌బాబు ఆమోదం తెలిపారు.

రాజధానిలో చేపట్టే నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. పనుల వివరాలను ఎప్పటి కప్పుడు ఆన్‌లైన్‌లో తెలియజేయాల‌ని సూచించారు. అదేస‌మ‌యంలో రాజ‌ధానిపై విమ‌ర్శ‌లు చేసేవారిని వ‌దిలి పెట్టొద్ద‌ని, అధికారులే చ‌ట్ట‌పరంగా పోరాటం చేయాల‌ని సూచించారు.