అమరావతిని కెలికిన నష్టం గుర్తు లేదా జగన్..!

వైసీపీ అధినేత జగన్ వైఖరి ఎక్కడా మారినట్టు కనిపించడం లేదు. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే మూడు రాజధానులను భుజాన ఎత్తుకున్నారు. ఈ తరహా ప్రయోగాలు ఆయనకు కలిసి రాకపోగా తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి. దేశవ్యాప్తంగా కూడా అనేకమంది అసహ్యించుకునేలాగా ఈ నిర్ణయం దారి తీసింది. దాని నుంచి అయినా పాఠం నేర్చుకుని ఉంటే బాగుండేది. కానీ, ఆయన ఎక్కడా ఆ దిశగా అడుగులు వేయలేదు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే ఆ ఇమేజ్ నిజంగా జగన్‌కు, చంద్రబాబుతో సమానంగా మంచి పేరు తెచ్చిపెట్టేది.

ఎందుకంటే అమరావతిని ప్రారంభించింది చంద్రబాబు అయినప్పటికీ పూర్తి చేసింది మాత్రం జగన్ అనే ఇమేజ్ ఉండిపోయేది. లేదా ఇద్దరికీ సమానమైన గౌరవం దక్కుండేది. ఈ విషయంలో జగన్‌కు ఎవరు సలహా ఇచ్చారు, లేకపోతే ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి అమరావతి విషయంలో చేసిన పొరపాటు జగన్‌కు పూడ్చుకోలేని నష్టంగా మారిపోయింది. సరే, ఇప్పటికైనా అమరావతి ప్రాధాన్యం, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను జగన్ గుర్తిస్తున్నారా అంటే అది కూడా లేదనే మాట వినిపిస్తోంది.

దీనికి కారణం ప్రస్తుతం వర్షాల కారణంగా అమరావతి ప్రాంతంలోని కొన్నిచోట్ల నీరు నిలిచిపోవడం. దీనిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాలు లేదా లోతట్టు స్థలాలు వర్షాలకు నిండిపోవడం సహజమే. ఇది అందరికీ తెలిసిన విషయం. సొంతంగా చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడే చిన్న వర్షం పడితే నీళ్లు నిలిచే పరిస్థితి ఉంటుంది. దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఎవరికీ లేదు. అయినా అమరావతిలో నీళ్లు నిలిచిపోతున్నాయని, సముద్రంలా మారిపోయిందని, నదులను తలపిస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుండడం మాత్రం దారుణం.

మనం ఎలాగూ సహకరించడం లేదు. చంద్రబాబు ఏదో తిప్పలు పడి అమరావతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిని హర్షించకపోగా వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల ఇప్పుడే కాక భవిష్యత్తులో కూడా తీవ్ర నష్టం ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని వైసీపీ నాయకుల్లో జరుగుతున్న అంతర్గత చర్చ. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే జగనే తలుచుకుని ఆ రోజు పూర్తి చేసి ఉంటే లేదా కనీసం నిర్మాణాలు ప్రారంభించి, రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చి ఉంటే ఆయనకు నేడు అర్హత ఉండేది.

కానీ, అసలు రాజధాని అమరావతి వద్దన్నట్టుగా వ్యవహరించి పక్కన పెట్టేయడం వల్ల ఉన్న ఇమేజ్ పోగొట్టుకున్నారు. పైగా ఇప్పుడు నదులను తలపిస్తోంది, సముద్రాన్ని తలపిస్తోంది అన్నట్టుగా విపరీత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఎన్నికలు వస్తాయి. అప్పుడైనా వైసీపీ గెలవాలి అంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలను మార్చుకోవాలి. ప్రజల మధ్యకు వెళ్లి వాటికి వివరణ ఇవ్వాలి. ఇట్లాంటి వ్యతిరేక ప్రచారాలను తప్పకుండా పక్కన పెట్టాలి.

కానీ, ఈ విషయాలు ఏవీ తనకు పట్టనట్టుగా, తానే చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తుండడం మళ్ళీ మళ్ళీ తప్పులపై తప్పులు చేస్తున్నట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి సొంత ఇల్లు కట్టుకుందామని ఎవరైనా రంగంలోకి దిగితే చేతిలో ఉన్న డబ్బుకి, చివరికి అయ్యే ఖర్చుకి మధ్య ఎటువంటి పొంతన ఉండదు. ఆ విషయం జగన్‌కు తెలియంది ఏమీ కాదు. రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతాయి లేదా లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అమరావతిని పక్కన పెట్టేయడం ఆయన ఆలోచన స్థాయిని అర్థం చేసుకునేలా చేస్తుంది.

చిన్న ఇల్లు కట్టుకోవడానికి కూడా డబుల్ ఖర్చు అవుతున్నప్పుడు, అమరావతి వంటి అతిపెద్ద ప్రాజెక్టును భుజానికి ఎత్తుకున్నప్పుడు అది ఎందుకు ఖర్చు కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఖర్చు పెరుగుతుంది. అది సహజం. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి మరో రూపంలో అమరావతి రాజధాని పూర్తి చేసుంటే జగన్ కు ఆ ఇమేజ్ పెరిగి ఉండేది. ఆ రోజు అది చేయలేకపోయారు. ఇప్పుడు నానా ప్రయత్నం పడి ఏదో అమరావతిని పట్టాలెక్కిస్తున్న ప్రభుత్వాన్ని దిగజారేలా వ్యతిరేక ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని రాజకీయ నాయకులతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇదే పద్ధతి కొనసాగితే అమరావతిని కెలికిన నష్టం జీవితాంతం జగన్ బాధపడేలా చేస్తుందని అంటున్నారు.