ఆహ్వానాలు లోకేష్‌కే.. రీజ‌నేంటి ..!

టీడీపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్ర‌బాబు కొన్ని కొన్ని కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ.. ఆ స్థానంలో ఆయ‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయ‌కులు, ఇత‌ర ప్ర‌ముఖుల ఇళ్ల‌లో జ‌రుగుతున్న శుభ‌కార్యాల‌కు.. సీఎం చంద్ర‌బాబు స్థానంలో ఇటీవ‌ల కాలంలో మంత్రినారాలోకేష్ క‌నిపిస్తున్నారు. దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం నారా లోకేష్‌పై మాత్రం అంత‌ర్గ‌తంగా చ‌ర్చ అయితే సాగుతోంది. ఆయ‌నను మ‌రింతగా ప్ర‌చారంలోకి తెచ్చేందుకు, మ‌రింత‌గా పార్టీలో క‌లుపుకొని పోయేలా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది ఈ చ‌ర్చ‌ల సారాంశం.

ఇటీవ‌ల ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు చెందిన ఓ నాయ‌కుడి కుమారుడి వివాహ రిస‌ప్ష‌న్ జ‌రిగింది.. దీనికి మంత్రి నారా లోకేష్ ను పంపించారు. వాస్త‌వానికి చంద్ర‌బాబుకు ఆహ్వానం అందినా.. ఆయ‌న వెళ్ల‌కుండా.. లోకేష్‌కు అవ‌కాశం ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావు సొంత‌గా నిర్మించిన ఓ స్కూలు ప్రారంభోత్స‌వానికి కూడా సీఎం చంద్ర‌బాబు ను ఆహ్వానించారు. కానీ, ఆయ‌న వెళ్ల‌కుండా నారా లోకేష్‌ను పంపించారు. ఇలా.. ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌కు చంద్ర‌బాబు దూరంగా ఉంటున్నారు. తాజాగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కుమార్తె వివాహానికి సంబంధించి నిశ్చితార్థ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించా రు.

వాస్త‌వానికి దీనికి సీఎం చంద్ర‌బాబునే నిమ్మ‌ల ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. కానీ.. దీనికి కూడా నారా లోకేష్‌నే పంపించారు. దీని కి ముందు మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ కార్య‌క్ర‌మానికి కూడా మంత్రి నారా లోకేషే వెళ్లారు. అప్ప‌ట్లో తెలంగా ణ సీఎం రేవంత్ రెడ్డితో క‌లిసి నారా లోకేష్ ఫొటోలు దిగి సంద‌డి చేసిన వ్య‌వ‌హారం మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. ఇలా.. నారా లోకేష్ ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం త‌ప్పుకాదు కానీ, చంద్ర‌బాబు రాకుండా.. మంత్రికి ప్రాధాన్యం ఇవ్వ‌డ‌మే చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. రాజ‌కీయంగానే కాకుండా.. ఆత్మీయ క‌ల‌యిక‌ల ద్వారా కూడా నారా లోకేష్ గ్రాఫ్ పెంచాల‌న్న వ్యూహం తోనే చంద్ర‌బాబు ఇలా చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇప్పుడు కాక‌పోతే.. మ‌రికొన్నాళ్ల‌కైనా.. పార్టీ బాధ్య‌త‌ల‌ను నారా లోకేష్‌కు అప్ప‌గించ‌డం ఖాయ‌మ‌నే విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే.. ఆయ‌న‌ను అన్నివైపుల నుంచి ప్రమోట్ చేయ‌డంతోపాటు.. పార్టీ ప‌రంగా, నాయ‌కుల ప‌రంగా కూడా.. మ‌రింత ఆత్మీయంగా ఆయ‌న‌ను క‌లుపుకొని పోయేలా చేయాల‌న్న వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు. పైగా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌డం ద్వారా.. కేవ‌లం రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా.. ఆయా కుటుంబాల‌కు కూడా నారా లోకేష్ చేరువ అవుతారు. ఇది వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు మేలు చేస్తుంద‌న్న ఆలోచ‌న కూడా ఉంది. ప్ర‌స్తుతం నారా లోకేష్‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం.. లేదా.. ఆయ‌న‌ను ప్రమోట్ చేయ‌డం మంచిదేన‌ని అంటున్నారు సీనియ‌ర్లు.