ఎస్సీనా-బీసీనా.. కాంగ్రెస్ తేల్చుకునే స‌మ‌యం!

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. ఈ నెల 21తో ఈ ఎన్నిక‌కు సంబంధించిన నామినేష‌న్ ప్ర‌క్రియ కూడా పూర్తి కానుంది. ఈ క్ర‌మంలో తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి త‌మిళ‌నాడుకు చెందిన చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణ‌న్‌ను ఎంపిక చేసింది. ఈయ‌న ఓబీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌. రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వులు కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న‌కు స‌రిసమాన‌మైన పోటీ ఇవ్వ‌గ‌ల నాయ‌కుడి ఎంపిక‌.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి పెద్ద అగ్నిప‌రీక్ష‌గా మార‌నుంది.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి తొలుత ఎస్సీ నేత‌ను ఎంపిక చేయాల‌ని.. అది కూడా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే అయితే.. మ‌రీ మంచిద‌ని కాంగ్రెస్ భావించింది. దీనిపై ప్ర‌క‌ట‌న కూడా చేయాల‌ని అనుకున్న స‌మ‌యం లో ఎందుకైనా మంచిది.. బీజేపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాల‌ని భావించింది. ఇది కాస్తా.. నిర్ణ‌యం జ‌రిగింది. ఓబీసీ గౌండ‌ర్ సామాజిక వ‌ర్గానికి చెందిన సీపీ రాధాకృష్ణ‌న్‌ను బీజేపీ ఎంపిక చే సింది. ఈయ‌న‌ను కేవ‌లం కులం ఆధారంగానే కాకుండా.. అనుభ‌వం ప్రాతిప‌దిక‌న కూడా.. ఎంపిక చేసిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ రెండింటితో పాటు.. వ‌చ్చే త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌ను కూడా లెక్క‌లోకి తీసుకుని.. బ‌ల‌మైన గౌండ‌ర్ సామాజిక వ‌ర్గానికి బీజేపీ పెద్ద‌పీట వేసింది. అంతేకాదు.. త‌మిళ‌నాడులో మంచి పేరు కూడా ఉంది. ఇలాం టి నాయ‌కుడికి ఎదురెళ్లి.. అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డం అంటే.. కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాల‌కు అంత ఈజీయేమీ కాదు. పైగా.. అంతే స్థాయి, సామాజిక‌ బ‌లం, అనుభ‌వం ఉన్న నాయ‌కుడు కావాల్సి ఉంటుంది. కానీ, ఇవ‌న్నీ ఉన్న‌వారు ఇప్పుడు కాంగ్రెస్‌లో క‌నిపించ‌డం లేదు. పైగా.. బీజేపీ ఓబీసీకి ఇచ్చింది కాబ‌ట్టి.. తాము క‌నీసంలో క‌నీసం బీసీకి అయినా ఇవ్వాలి.

ఇలా.. బీజేపీ వేసిన పాచిక‌తో కాంగ్రెస్ అష్ఠ‌దిగ్భంధం అయిపోయింది. అంతేకాదు.. బీజేపీకి ఉన్న మ‌రో సానుకూల‌త‌.. ఎన్డీయే మిత్ర ప‌క్షాల‌ను మోడీ ముందుగానే ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చారు. దీంతో ఈ ఎంపిక ఆయ‌న‌కు మ‌రింత సానుకూలంగా.. ఇబ్బంది లేకుండా న‌ల్లేరుపై న‌డ‌క‌గా మారిపోయింది. ఇలా చూసు కుంటే.. ఇండియా కూట‌మిలో భిన్న‌మైన వాద‌న‌లు ఉన్న పార్టీల మ‌ధ్య ఏక‌త్వం రావ‌డంతోపాటు.. అభ్య ర్థి ఎంపిక కూడా అంత ఈజీ కాద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ఒక చిన్న ప‌ద‌వికి అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డ‌మే ఇండీ కూట‌మికి ఇబ్బందిగా ఉన్న ప‌రిస్థితిలో ఇప్పుడు అతి పెద్ద ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డం.. అందునా.. కేవ‌లం రెండు రోజుల్లోనే సాధ్య‌మా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.