ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఓట్ చోరీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) గ్యానేష్ కుమార్, ఎన్నికల సంఘం కమిషనర్లతో కలిసి ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రదాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రాహుల్ పేరు గానీ, పార్టీల పేర్లను గానీ ప్రస్తావించకుండానే గ్యానేష్ కుమార్… ఓట్ చోరీ తరహా దుష్ప్రచారానికి భయపడేది లేదని తేల్చి చెప్పారు.
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీకి అధికార పార్టీ అని, ప్రతిపక్ష పార్టీ అనే తేడా ఎంతమాత్రం ఉండదని గ్యానేష్ కుమార్ స్పష్టం చేశారు. అసలు ఆ తరహా ఆలోచనే రాని విధంగా ఎన్నికల సంఘం పనిచేసుకుంటూ వెళుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పక్షపాతం ఉండదని చెప్పారు. ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటుగా బూత్ లెవెల్ దాకా ఓటరు జాబితాలను అందజేసి… ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తామన్నారు. ఎప్పుడు; ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే జరుగుతుందని కూడా ఆయన వివరించారు.
ఇక ఓట్ చోరీ గురించి ప్రధానంగా ప్రస్తావించిన గ్యానేష్ కుమార్… ఓట్ చోరీ అంటూ కొందరు ఓటర్ల పేర్లను, వారి ఫొటోలతో సహా బయటపెట్టారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల ఓట్లను బహిరంగ పరచినట్లుగా మీ ఇంటి సభ్యుల ఓట్లను బహిర్గతం చేయగలరా? అని కూడా ఆయన ప్రశ్నించారు. పౌరులకు ఓటు హక్కు కల్పించడంతో పాటుగా వారి గోప్యతను కాపాడే బాధ్యత కూడా తమదేనన్నారు. ఈ లెక్కన ఓటర్ల అనుమతి లేకుండా వారి వివరాలను బహిర్గతం చేసినవారిపై తాము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు.
ఓట్ చోరీ అంటూ ఆరోపణలు గుప్పించిన వారి వద్ద అందుకు సంబంధించిన ఆధారాలే లేవని కూడా గ్యానేష్ కుమార్ సంచలన వ్యాఖ్య చేశారు. అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే…వాటిని అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలని, వాటిని తాము పరిశీలించి అసలు వాస్తవమేమిటో చెబుతామన్నారు. ఓట్ చోరీ తరహా దుష్ప్రచారాలకు భయపడేది లేదని ఆయన కీలక వ్యాఖ్య చేశారు. ఇక బీహార్ ఓట్ల సవరణ జాబితా గురించి ప్రస్తావించిన సీఈసీ… దేశంలో ఎన్నికల సంస్కరణలు జరుగుతున్నాయని, అందులో బాగంగానే బీహార్ ఓటరు జాబితాను సవరిస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్న కుమార్… ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారికి ఎలా ఓటు హక్కు కల్పిస్తామని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates