ఊరందరిదీ ఒకదారైతే.. వైసీపీది మరో దారి అన్నట్టుగా ఉంది రాజకీయం. మరి ఆ పార్టీ నాయకులు ఆలోచించి మాట్లాడుతు న్నారో.. ఆలోచన లేకుండానే విమర్శలు చేస్తున్నారో తెలియదు కానీ.. ప్రజల ముందు మాత్రం చులకన అవుతున్నారు. నెటిజ న్ల నుంచి ట్రోల్స్‌కు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సులను మహిళలకు చేరు వ చేసింది. ఏపీలో ఇలాంటి కార్యక్రమం అమలు చేయడం ఇదే తొలిసారి.
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు 2 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ఇక, దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు అయితే.. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రుణ పడి ఉంటామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో అయితే..చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు కూడా నిర్వహిం చి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండుల్లోనూ మహిళల సందడి జోరుగా పెరిగింది. కుటుంబాల కు కుటుంబాలు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంపై ఆనందం వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నట్టుగా.. ఈ పథ కంపై పసలేని విమర్శలు చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలకు కూటమి సర్కారు అన్యాయం చేసిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ మోసం చేసిందని అన్నారు. ఆర్టీసీలో మొత్తం 16 రకాల బస్సులు ఉన్నాయని, వాటిలో కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దూర ప్రాంతాలకువెళ్లేవారు.. నాలుగు బస్సులు మారి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని కూడా విమర్శలు గుప్పించారు.
కానీ, వాస్తవం ఏంటంటే.. ఏపీలో ఈ పథకం ఇప్పుడు అమలైనా.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపుఏడాదిన్నరగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. అయితే.. అక్కడ కూడా ఇలానే ఎంపిక చేసిన సర్వీసుల్లోనే ప్రయాణాలను అనుమతిస్తున్నా రు. ఏపీలో ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లో ఉంటే.. తెలంగాణలో నాలుగు రకాల బస్సుల్లోనే ఉచితాన్ని అమలు చేస్తున్నారు. కర్ణాటకలో కేవలం జిల్లాల పరిధికే పరిమితం చేశారు. ఇవన్నీ వాస్తవాలు. ఇక, ఉచిత ప్రయాణానికే మొత్తం సర్వీసులు కేటాయిస్తే.. ఆర్టీసీపైన, ప్రభుత్వంపైనా ఆర్థిక భారం కాదా? అన్నది మరో ప్రశ్న. ఉచిత హామీలు అంటే.. పూర్తిగా తుడిచి పెట్టేయడం కాదు కదా?. వ్యవస్థల ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలి. ఇవన్నీ వదిలేసి..వైసీపీ తన బాధను ప్రపంచం బాధగా చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వచ్చేలా వ్యవహరిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates