మండలి రద్దుపై జగన్ వెనక్కు తగ్గాడా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరిని శాసనమండలికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. మరికొందరకి ఎంఎల్సీ పదవులను ఇస్తానని హామీ ఇస్తున్నారు. అంటే జరుగుతున్నది చూస్తుంటే మండలి రద్దు సిఫారసుపై జగన్ వెనక్కు తగ్గినట్లేనా అనే డౌటు పెరిగిపోతోంది. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే మండలిలో మాత్రం బిల్లులు వీగిపోయాయి. మండలిలో తమకే ఎక్కువ మద్దతున్న కారణంగా టీడీపీ సభ్యులు బిల్లులపై కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా గోల చేశారు.

దాంతో ఒళ్ళు మండిపోయిన జగన్ అసలు శాసనమండలే అవసరం లేదంటు రద్దుకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అంశం ఎన్ని మలుపులు తిరిగిందో అందరు చూసిందే. మండలి రద్దంటే రాష్ట్రప్రభుత్వం నిర్ణయిస్తే సరిపోదు. అసెంబ్లీ సిఫారసుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపాల్సుంటుంది. అప్పుడే దానిపై రాష్ట్రపతి సంతకం పెడతారు. నిజానికి శాసనమండలి రద్దు లేదా పునరుద్ధరణ అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమే. గతంలో ఎన్డీయార్ మండలిని రద్దు చేసినా, తర్వాత దివంగత సిఎం వైఎస్సార్ హయాంలో మండలి పునరుద్ధరణ జరిగినా అంతా రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల ప్రకారమే జరిగింది.

అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఫారసు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే సిఫారసు వెళ్ళిన దగ్గర నుండి కరోనా వైరస్ కారణంగా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగటం లేదు. మండలి రద్దుకు సిఫారసు వెళ్ళే సమయానికి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కారణంగా అప్పటికప్పుడు పార్లమెంటు సమావేశాల్లో పెట్టడం కుదరదని కేంద్రం చెప్పేసింది. తర్వాత జరగబోయే సమావేశాల్లో సబ్జెక్టును అజెండాగా తీసుకొస్తామని చెప్పింది. అయితే ఆ తర్వాత కరోనా వైరస్ కారణంగా పార్లమెంటు సమావేశాలే జరగలేదు. ఈమధ్య కొద్దిరోజులు సమావేశాలు జరిగినా ముఖ్యమైన సబ్జెక్టులను మాత్రమే పార్లమెంటులో చర్చించారు.

కరోనా వైరస్ కారణంగా పూర్తిస్ధాయి పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో ఎవరు చెప్పలేకున్నారు. దాంతో రోజులు గడిచేకొద్దీ జగన్ కూడా రద్దు విషయాన్ని పునరాలోచించినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ ఎంఎల్సీలు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ ఎంఎల్సీ పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. అలాగే శివనాదరెడ్డి కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సో వివిధ కారణాల వల్ల కౌన్సిల్లో టీడీపీ బలం తగ్గి వైసీపీ బలం పెరుగుతోంది. 2022 చివరకు మండలిలో వైసీపీకే సంపూర్ణ మెజారిటి వచ్చేస్తుందని అంచనా. దాంతో మండలి రద్దు నిర్ణయంపై జగన్ వెనక్కు తగ్గినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)