అభినందించాల్సిన ఎమ్మెల్యే: బాబు కామెంట్‌

టీడీపీ నుంచి 134 మంది ఎమ్మెల్యేలు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో సీఎం చంద్ర బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌ను ప‌క్క‌న పెడితే.. 132 మంది ఒక్క టీడీపీకే ఉన్నారు. అయితే.. వీరిలో ఎంత మంది సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద మార్కులు వేయించుకుంటున్నార‌న్న‌ది ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్థ‌క‌మే. తాజాగా గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గ‌ళ్లా మాధ‌విని చంద్ర‌బాబు అభినందించారు.

“అభినందించాల్సిన ప‌ని చేస్తున్నారు.” అంటూ.. మాధ‌విని సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. ఒక్క నిముష‌మే ఆమెతో మాట్లాడినా.. ఆమె ప‌నితీరును మెచ్చుకున్నారు. వాస్త‌వానికి స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే ఉండ‌వ‌ల్లిలో ప్రారంభించారు. అయితే.. జిల్లాకు చెందిన మ‌హిళా నాయ‌కులు రావాల‌ని క‌బురు పెట్టారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే మాధ‌వి స‌హాప‌లువురు నాయ‌కులు అక్క‌డ‌కు చేరుకున్నారు. ఈ స‌మ‌యంలో మాధ‌విని పేరు పెట్టి పిలిచిన చంద్ర‌బాబు.. మంచి ప‌నులు చేస్తున్నారు.. భేష్ అంటూ.. ప్ర‌శంసించారు.

రీజ‌నేంటి..

మాధ‌విని ఇంత‌గా ప్ర‌శంసించ‌డానికి కార‌ణం.. కూట‌మి ప్ర‌భుత్వం చేప‌డుతున్న అన్ని ప‌నుల‌ను ఆమె తూ. చ త‌ప్ప‌కుండా కొన‌సాగిస్తున్నారు. అంతేకాదు.. తానే స్వ‌యంగా రోజూ బైక్‌పై ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. వారి బాగోగులు చూసుకుంటున్నారు. స‌మ‌స్య ఎక్క‌డున్నా.. నేనున్నా నంటూ.. మాధ‌వి ముందుంటున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు త‌ప్ప‌.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ పెద్ద‌గా స‌మ‌స్య‌లు రాక‌పోవ‌డం.. ఎమ్మెల్యే ప‌నితీరుకు ప్ర‌జ‌ల నుంచి కూడా మంచి స్పంద‌న రావ‌డంతో చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు.

ఇటీవ‌ల సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల తీరును స్వ‌యంగాచంద్ర‌బాబు ఐవీఆర్ఎస్ స‌ర్వే ద్వారా తెలుసుకున్నారు. దీనిలో గుంటూరు జిల్లాకు చెందిన మాధ‌వికి జిల్లాస్థాయిలో ముందున్నారు. ఈ విష‌యంలో ఆమెకు నూటికి నూరు శాతం మంది ప్ర‌జ‌లు మంచి రిజ‌ల్ట్ ఇచ్చారు. ఈ ప‌రిణామ‌మే చంద్ర‌బాబును ఆమె ప‌ట్ల ఫిదా అయ్యేలా చేసింది. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించ‌డంతోపాటు.. త‌ల్లికి వంద‌నంలో అర్హులై ఉండి నిధులు రాని వారికి తిరిగి ఇప్పించ‌డంతో ఆమె పేరు మార్మోగుతోంది.