కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఓటర్లను తొలగించే హక్కు తమకు ఉందని.. అదేసమయంలో ఎందుకు తొలగించామో.. చెప్పాల్సిన అవసరం మాత్రం తమకు లేదని.. నిబంధనలు కూడా తమకు అనుకూలంగానే ఉన్నాయని వాదిస్తూ వచ్చిన ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చిం ది. “ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగించడం అంటే.. ప్రజల హక్కులను తొలగించినట్టే. దీనిని తెలుసుకునే అవకాశం, అవసరం కూడా వారికి ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పారదర్శకత చాలా ముఖ్యం.” అని వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలో బిహార్‌లో ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఎన్నికల ఓటర్ల జాబితాలో తొలగించిన 65 లక్షల మంది ఓటర్లను ఎందుకు తొలగించారు? ఎక్కడ తొలగించారు? వారు ఎప్పటి నుంచి ఓట్లు వేస్తున్నారు? తొలగించడానికి ముందు వారికి సంబంధించిన వివరాలు మీ వద్ద ఉన్నాయా? వంటి కీలక అంశాలను లేవనెత్తింది. ఆయా వివరాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. “మీరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. మేం ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం. ప్రజలకు అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆయా వివరాలను మీరు ఆన్‌లైన్‌లో పెట్టండి. ప్రజలకు చెప్పండి.” అని కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
బీహార్ ఓటర్ల జాబితాలో 65 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగిస్తూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర యుద్ధమే ప్రకటించింది. బతికి ఉన్న వారిని కూడా జాబితా నుంచి తొలగించారని పేర్కొంది. అంతేకాదు.. జాబితాల్లో చనిపోయారంటూ.. పేర్కొన్న వారిని ఢిల్లీకి పిలిపించిన రాహుల్‌గాంధీ.. వారితో కలిసి టీ తాగుతూ.. సంబంధిత ఫొటోలను ఆన్లైన్‌లో పెట్టారు. “ఎన్నికల సంఘం చనిపోయారని పేర్కొన్న వారు.. ఇప్పుడు నాతోనే ఉన్నారు. వారంతా టీ తాగేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.” అని రాహుల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ పరిణామం తాజాగా ఈ కేసులను పరిశీలిస్తున్న సుప్రీం కోర్టును కుదిపేసింది. చనిపోయారని చెబుతున్నవారు బతికి ఉన్నారంటే.. ఎన్నికల సంఘంలోనే ఏదో లోపం ఉందని వ్యాఖ్యానించింది. పారదర్శక తకు పెద్దపీట వేయాల్సిన సంఘం.. ఇలా వ్యవహరించడం ఏంటని నిలదీసింది. ఈ నేపథ్యంలో వారి వివరాలను ఎన్నికల వెబ్ సైట్‌లో జిల్లాల వారీగా అందరికీ తెలిసే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ప్రజల ప్రాథమిక హక్కులు రాజకీయాలపై ఆధారపడడాన్ని తాము సహించేది లేదని స్పష్టం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates