ఆర్. ఎస్‌. ప్రవీణ్ అరెస్టు.. కేటీఆర్ ఫైర్‌!

బీఆర్ ఎస్ పార్టీ నాయ‌కుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా దుమారం రేపింది. ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్న‌వారిని అరెస్టు చేయ‌డం, వారి గొంతు నొక్క‌డం సీఎం రేవంత్ రెడ్డికి వెన్న‌తో పెట్టిన విద్య అంటూ.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌వీణ్ కుమార్‌ను విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఏం జ‌రిగింది?

ఆసిఫాబాద్ జిల్లాలోని పోడు భూముల్లో సాగుచేసుకునే గిరిజ‌న రైతులు.. త‌మ‌కు హ‌క్కులుక‌ల్పించాల‌ని కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే.. స‌ర్కారు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా.. పోడు భూముల‌కు చ‌ట్టం వ‌ర్తించ‌ద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ, రైతులు మాత్రం వివిధ రూపాల్లో త‌మ డి మాండ్ల సాధ‌న‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరికి స‌హ‌జంగానే క‌మ్యూనిస్టు పార్టీల మ‌ద్ద‌తు ఉంది. తాజాగా.. బీఆర్ఎస్ కూడా ఈ రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఆర్ ఎస్‌. ప్ర‌వీణ్‌.. రైతుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఆసిఫాబాద్‌కు బ‌య‌లు దేరారు.

ఇక‌, ఈ విష‌యం తెలిసిన పోలీసులు కాగ‌జ్‌న‌గ‌ర్ వ‌ద్దే ఆర్‌.ఎస్. ప్ర‌వీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌ను వేరే పోలీసు స్టేష‌న్‌కు త‌రలించే క్ర‌మంలో వాహ‌నాన్ని బీఆర్ ఎస్ నాయ‌కులు చుట్టుముట్టి ప్ర‌వీణ్‌ను త‌క్ష‌ణ‌మే వ‌దిలి పెట్టాల‌ని నినాదాలు చేశారు. ఇక‌, ఈవ్య‌వ‌హారంపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్‌.. రైతుల హ‌క్కుల కోసం.. పేద‌ల ప‌క్షాన తాము పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేక పోతోంద‌ని.. అందుకే త‌మ నాయ‌కుల‌ను అరెస్టు చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌వీణ్‌ను విడిచిపెట్ట‌క‌పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. దీనిపై ప్ర‌భుత్వం స్పందించాల్సి ఉంది.