పులివెందులపై టీడీపీ జెండా… వైసీపీకి డిపాజిట్ గల్లంతు

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార కూటమి రథసారథి టీడీపీ విజయ దుందుభి మోగించింది. ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) సతీమణి లతా రెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై ఏకంగా 6033 భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత ఈ స్థానంలో టీడీపీ విజయం సాధించడం గమనార్హం. వైసీపీ అధినేత జగన్ సొంతూరు అయిన పులివెందులలో ఆ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పులివెందుల జడ్పీటీసీ స్థానంలో మొత్తంగా 10,070 ఓట్లు ఉండగా…ఎన్నికల్లో7,638 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డికి 6,716 ఓట్లు పడగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక మిగిలిన 9 మంది అభ్యర్థులు, నోటాకు కలిపి 239 ఓట్లు పడ్డాయి. ఫలితంగా హేమంత్ రెడ్డిపై లతా రెడ్డి 6,033 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్టైంది. మొత్తం 15 పోలింగ్ బూత్ లలో జరిగిన ఎన్నికల ఓట్లను గురువారం ఉదయం కడపలో పది టేబుళ్లపై లెక్కించారు. ఒకే ఒక రౌండ్ లో ఫలితం తేలిపోయింది. కౌంటింగ్ ను లతా రెడ్డి స్వయంగా పరిశీలించగా… రీపోలింగ్ తో పాటు కౌంటింగ్ ను కూడా బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించడంతో హేమంత్ రెడ్డి కౌంటింగ్ దరిదాపుల్లోనే కనిపించలేదు.

పులివెందుల జడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే గెలుపుపై చేతులెత్తిన వైసీపీ… ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక కారణం చెబుతూ సాగింది. పోలింగ్ నాడు కూడా సాక్షాత్తు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కూడా తన ఓటు వేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. తమ ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన ఆయన… ఇలాగైతే తామెలా ఎన్నికలకు వెళతామని ప్రశ్నించారు. తనను టీడీపీ గూండాలు బెదిరిస్తున్నారని, తనకు భద్రత కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఇక రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ కౌంటింగ్ నూ బాయ్ కాట్ చేసింది.

ఒంటిమిట్ట కూడా టీడీపీదే…

ఇదిలా ఉంటే… పులివెందులతో పాటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలోనూ టీడీపీ విజయం దిశగా దూసుకుపోతోంది. టీడీపీ అభ్యర్తిగా బరిలోకి దిగిన ముద్దు క్రిష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై ఇప్పటికే రెట్టింపు సంఖ్యలో ఓట్లను సాదించారు. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల ఓట్లు ఉండగా… 20 వేల ఓట్ల దాకా పోలయ్యాయి. కడపలోనే జరుగుతున్న ఒంటిమిట్ల కౌంటింగ్ లో మధ్యాహ్నం 2 గంటల సమయానికి ముద్దు క్రిష్ణకు 6,270 ఓట్లు రాగా.. సుబ్బారెడ్డికి 3,165 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా ఇప్పటికే వైసీపీపై ముద్దు క్రిష్ణ 3,105 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. మొత్తంగా ఇక్కడ కూడా టీడీపీ విజయం దాదాపుగా ఖరారైనట్టేనని చెప్పక తప్పదు.