తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఒకే ఒక ఓటమి టిఆర్ఎస్ను కష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఒక్క ఓటమి తర్వాత అటు పార్టీపై కేసీఆర్ ఫ్యామిలీకి పట్టు సడలుతోంది. మరోవైపు ఫ్యామిలీ లోనూ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
అమెరికాలో చదువుకున్నంత మాత్రాన నాయకుడు కాదు.. ముందు చక్కగా పార్టీ నడుపుకోవాలి.. డబ్బులు ఇచ్చి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించటం నాయకత్వం కాదు అని ఆయన చాలా గౌరవంగా రాజీనామా లేఖలో కేటీఆర్ పై సుతి మెత్తని విమర్శలు చేశారు. బాలరాజు బిజెపిలో చేరాలని నిర్ణయించుకోవడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆయనతోపాటు ఆయన భార్య పైన కామెంట్లు చేసింది. గువ్వల బాలరాజు ఒక బచ్చాగాడిని విమర్శించారు.
అయితే దీనిపై తెలంగాణ రాజకీయ వర్గాలలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఏ రాజకీయ నేత ఎప్పుడూ ఒకే పార్టీలో ఉండటం సాధ్యం కాదు.. ఆ మాటకొస్తే కెసిఆర్ కూడా పార్టీలు మారి బీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. తాను ఉన్న పార్టీలో భవిష్యత్తు లేదనుకున్నప్పుడు కచ్చితంగా మరో దారి చూసుకుంటారు. రాజకీయంగా విమర్శలు చేయడంలో తప్పులేదు కానీ.. వ్యక్తిగత విమర్శలు బూతులు తిట్టడం, వార్నింగ్‌లు, బెదిరింపులు చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు గువ్వల బాలరాజు విషయంలో అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో తమకు నచ్చిన వారిని టార్గెట్ చేయటం బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చేస్తోంది. తమను వ్యతిరేకించే వారందరి పైన బూతులు తిట్టడం, వార్నింగ్‌లు ఇవ్వటం వాళ్ళను తిట్టి వీడియోల ప్రసారం చేయడం బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటజీగా మారింది.
అయితే ఇలాంటి చర్యల వల్ల ఒక్క ఓటు అదనంగా రాకపోగా సాధారణ ప్రజలలో చిరాకు వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏది నిజం ? ఏది అబద్దం అని విచక్షణ చేసే స్థాయి ఉంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు నిజం అని ఎవరు భ్రమలలో మునిగి తేలటం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో చేసిన పోరాటం పెద్దగా లేదు. మరీ ముఖ్యంగా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం రాజకీయ సభలతో సరిపెడుతున్నారు.
నిక్కచ్చిగా ఒక ప్రజా సమస్య కోసం బీఆర్ఎస్ గట్టిగా పోరాటం చేయలేదు. దీనికి తోడు అటు సొంత కుటుంబంలో కవిత నుంచి కౌంటర్లు కేటీఆర్ కు పడుతున్నాయి. ఏది ఏమైనా స్పష్టమైన దిశ నిర్దేశం లేక బీఆర్ఎస్ ముందుకు వెళ్లకపోగా.. దిగువకు వెళుతున్న వాతావరణం తెలంగాణ రాజకీయ వర్గాలలో స్పష్టంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates