‘అది వైసీపీ ‘ల‌క్కీ’ నెంబ‌రు క‌దా’

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీపై ఎప్పుడూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే చంద్ర‌బాబు తాజాగా జోకులు పేల్చారు. అమ‌రావ‌తిపై స‌మీక్ష చేస్తున్న స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. ‘పులివెందుల‌లో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 మంది పోటీలో ఉన్నారు. అంతా ప్ర‌శాంతంగా జ‌రిగిపోయింది. ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నిక‌లు నిర్వంహించాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు ఫోన్ నుంచి మంత్రి నారాయ‌ణ‌కు మెసేజ్ వ‌చ్చింది. దీనిని ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు చూపించారు. సాధార‌ణంగా సీఎం స‌మ‌క్షంలో మెసేజ్ రావ‌డంతో ఆయ‌న ఎలానూ అడుగుతారు కాబ‌ట్టి.. మంత్రి ఆయ‌న అడ‌గ‌క ముందే చూపించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “11 మంది నామినేష‌న్లు వేశారా? అంద‌రూ పోటీలో ఉన్నారా? ఎవ‌రైనా ఉప‌సంహ‌రించుకున్నారా? ” అని ప్ర‌శ్నించారు. వైసీపీ ఎవ‌రిపైనైనా ఒత్తిడి చేసి పోటీ నుంచి త‌ప్పుకొనేలా చేసిందా? అని కూడా అడిగారు. దీనికి మంత్రి నారాయ‌ణ స‌మాధానం ఇస్తూ.. అంద‌రూ పోటీలో ఉన్నార‌ని.. ఎవ‌రిపైనా ఒత్తిళ్లు తీసుకు రాలేదని, ఈ విష‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు బాగా ప‌నిచేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. “అయితే.. వైసీపీ ల‌క్కీ నెంబ‌ర్‌తోనే ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్న‌మాట‌.” అని చంద్ర‌బాబు చిరున‌వ్వులు చిందించారు. అంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానా ల్లోనే విజ‌యం ద‌క్కింది.

ఇప్పుడు జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌లోనూ.. రెండు చోట్లా 11 మంది చొప్పున మాత్ర‌మే పోటీలో ఉన్నారు. వీరిలో ఎవ‌రూ నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకోకుండా చివ‌రి వ‌ర‌కు పోరాడారు. ఇక‌, సీపీఐ, సీపీఎంలు స‌హా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా బ‌రిలో ఉన్నారు. దీంతో అలు పులివెందుల‌, ఇటు ఒంటిమిట్ట‌ల్లోనూ 11 చొప్పున అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. ఈ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన సీఎం చంద్ర‌బాబు.. “ల‌క్కీ నెంబ‌రు” అంటూ.. వైసీపీపై జోకులు పేల్చారు. దీనికి నారాయ‌ణ స‌హా.. స‌మావేశంలో ఉన్న సీఆర్‌డీఏ అధికారులు కూడా ముసిముసి న‌వ్వులు చిందించారు.