జ‌గ‌న్‌.. నీకిదే చెబుతున్నా: బాబు వార్నింగ్‌

Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా స్పందించారు. జ‌గ‌న్ మీడియా స‌మావేశాన్ని చంద్ర‌బాబు టీవీలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించినట్టు తెలిసింది. అనంత‌రం.. ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ నీకిదే చెబుతున్నా.. అంటూ గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. ముఖ్యంగా త‌న పాల‌న‌ను చంబ‌ల్ లోయ‌తో పోల్చి మాట్లాడ‌డాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌రింత సీరియ‌స్ అయ్యారు.

“నేనంటే ఏమ‌నుకున్నావ్‌. మీ నాన్న వైఎస్‌కే భ‌య‌ప‌డ‌లా. మీ అరాచ‌కాలు.. అకృత్యాలు సాగుతాయ‌ని అనుకుంటే పొర‌పాటే. ఈ రోజు పులివెందుల‌కు నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం వ‌చ్చింది. ప్ర‌జ‌లు నిర్భ‌యంగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. నీ తండ్రి, నీతాతల హ‌యాంలో ఎప్పుడైనా ఇంత భారీ ఎత్తున పోలింగ్ జ‌రిగిందా? ఖ‌బ‌డ్దార్‌.. ఇదే చెబుతున్నా.. నీ ఆట‌లు సాగ‌నివ్వ‌ను., ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుక‌ట్ట వేసి తీరుతా. నీకు దిక్కున్న చోట చెప్పుకో!” అని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

పులివెందుల ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? .. అరాచ‌కాలు సాగ‌డానికి అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ప్ర‌జా స్వామ్యయుతంగా ఎన్నిక‌ల అధికారులు వ్య‌వ‌హ‌రించినందుకే.. 11 మంది నామినేష‌న్లు వేసి.. చివ‌రి వ‌రకు పోటీలో ఉన్నార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. తాజాగా చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ప‌ర్య‌టించారు. ఈస‌మ‌యంలోనే జ‌గ‌న్ మీడియా మీటింగ్ ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. అనంత‌రం.. ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి విన‌తులు తీసుకున్నారు. వాటి ప‌రిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు.. “వైయస్‌ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు. ఈసారి మాత్ర‌మే ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. దీనిని జ‌గ‌న్ జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆయ‌న‌కు ఒక్క‌టే చెబుతున్నా.. గుర్తు పెట్టుకోవాలి. నీ అరాచకాలు జరగవు. గంజాయి బ్యాచ్‌కి, రౌడీల‌కు మ‌ద్ద‌తు ప‌లికే నీకు.. ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే హ‌క్కులేదు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి కాబ‌ట్టే.. ప్ర‌జ‌లు ఓటు వేసి.. పులివెందుల‌ను కాపాడాల‌ని కోరుకున్నారు.” అని వ్యాఖ్యానించారు.