బాబు కోరకుండానే మోడీ వరం.. ఏపీకి కీలక ప్రాజెక్టు

ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్న పనులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చకచకా చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతికి రుణం ఇప్పించడంతో పాటు కేంద్రం కూడా గ్రాంట్లు ఇస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు సమకూరుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రాజెక్టులకు కూడా నిధులు ఇస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆపేసిన పథకాలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అమలు చేస్తోంది. వీటికి సైతం కేంద్రం నిధులు ఇస్తోంది. ఇలా చంద్రబాబు కోరిన పనులు చేస్తున్న కేంద్రం ఇప్పుడు కోరకుండానే ఏపీకి కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది.

కీలకమైన సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఏపీకి కేటాయిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. సెమీ కండక్టర్లను అటు రక్షణ రంగం నుంచి ఎలక్ట్రానిక్ రంగం వరకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు చైనా సహా జపాన్ నుంచి సెమీ కండక్టర్లను దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వదేశీ సెమీ కండక్టర్ల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు 2030 నాటికి సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా తాజాగా మూడు రాష్ట్రాలకు నాలుగు సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేటాయించారు. వీటిలో ఏపీ, ఒడిశా, పంజాబ్ ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులకు కేంద్రం రూ.4,594 కోట్లను ఖర్చు చేయనుంది. ఇదిలావుంటే దేశంలో ఇప్పటివరకు 6 సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య 10కి చేరింది. ఏపీకి కేటాయించిన సెమీ కండక్టర్ ప్రాజెక్టుతో సుమారు 2 వేల మంది యువతకు ఉపాధి లభించనుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా పనిచేయనుంది. బీఈ (బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్) చదివిన వారికి దీనిలో ఉద్యోగాలు లభించనున్నాయి. టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌లో వీటిని వినియోగిస్తారు.

లోకేష్ రియాక్షన్ ఇదే

మోడీ ప్రభుత్వం ప్రకటించిన సెమీ కండక్టర్ ప్రాజెక్టుపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో లభించే లాభం ఇదేనన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఆత్మనిర్భర భారత్‌కు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో కేంద్రం స్వయంగా ఏపీని ఎంచుకోవడం రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలనకు నిదర్శనమని తెలిపారు.