పోలీసులపై వైసీపీ నాయకులు మరోసారి నోరు వేసుకున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ అధినేత జగన్ పోలీసులను తరచుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రోడ్ల వెంబడి తిప్పారని పేర్కొంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను ఉద్దేశించి రాచమల్లు మాట్లాడుతూ.. “మేం అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు ఉండవు. ఊడ పెరుకుతాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అధికార పార్టీకి పోలీసులు గుమస్తాలుగా పనిచేస్తున్నారని అన్నారూ. ఇప్పుడు తప్పులు చేస్తున్న పోలీసుల పేర్లను తాము నమోదు చేసుకుంటున్నామని, నాలుగేళ్లలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అంతు చూస్తామని వ్యాఖ్యానించారు. పులివెందుల ఏమైనా టీడీపీ అడ్డానా? వారికి ఎందుకు సహకరించారు? ఎందుకు చెంచాగిరీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటివారిని వదిలిపెట్టేది లేదన్నారు.
ముగిసిన పోలింగ్
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఐదు గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఇక పులివెందులలో 15 బూత్‌లలోను, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఇదిలావుంటే పులివెందులలో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పులివెందుల నేతలను (టీడీపీ, వైసీపీకి చెందిన) పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒంటిమిట్టలో మాత్రం పెద్దగా అల్లర్లు జరగకుండా ప్రశాంతంగానే సాగిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates