నా సహనం పరీక్షిస్తున్నారా!

గత నాలుగు రోజులుగా స్వరం పెంచి వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ రాజా మరింత దూకుడు పెంచారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా ఆయన స్పందిస్తూనే ఉన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నారా లేదా అని నిలదీశారు. దీనికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ “ఔను ఇస్తామని మాటిచ్చాం” అంటూ సమర్థించారు.

ఈ పరిణామాల తర్వాత మరింతగా రాజా రెచ్చిపోతున్నారు. తాజాగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా సహనం పరీక్షిస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఆయన ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, వారికి మూడు మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. అలాగే ఖమ్మం నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, అక్కడ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. కాబట్టి తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు “ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులా?” అని కొందరు అంటున్నారు. మరికొందరు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చినప్పుడు తెలియదా మేము అన్నదమ్ములమని? పార్లమెంటు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పుడు మేము అన్నదమ్ములమనే విషయాన్ని మరిచిపోయారా? మీ గెలుపు కోసం ఆ నాడు హామీలు గుప్పించి ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తారా?” అని సూటిగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో తాను సహనంతో ఉన్నానని, తన సహనాన్ని పరీక్షించవద్దని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. అంతేకాదు తనకు పదవి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసునని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు క్రమశిక్షణ సంఘం చీఫ్, ఎంపీ మల్లురవి రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు తమ పరిశీలనలో లేవని వెల్లడించారు.