సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణి దారుణ హత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు మంగళవారం సీబీఐని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను తమకే అందించాలని ఆదేశించడం గమనార్హం. అంతేకాదు, ఈ దారుణ హత్య కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టకూడదని, రాజకీయ ఒత్తిళ్లు, అధికారిక పలుకుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
ఏం జరిగింది?
గట్టు వామనరావు, నాగమణి ఇద్దరూ హైకోర్టు స్థాయి న్యాయవాదులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన వీరు హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అయితే, భూములకు సంబంధించిన వివాదంపై ఓ కేసులో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు ఈ దంపతులపై పగబట్టారన్నది వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతివాదులైన పుట్ట మధు సోదరులు తమపై కత్తి కట్టారని, వారే తమను చంపించారన్నది ఆయన వాంగ్మూలం.
2021 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లాకు వెళ్లి వస్తున్న సమయంలో కల్వచర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును కొందరు అడ్డుకుని, నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అప్పట్లో హైకోర్టు న్యాయవాదులు వారం రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం విచారణను పూర్తి చేసింది.
అయితే, అసలు నిందితులను తప్పించారని ఆరోపిస్తూ వామనరావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపిన కోర్టు, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ అభిప్రాయం కోరింది. సీబీఐకి ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. మరణ వాంగ్మూలం నిజమని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక స్పష్టం చేయడంతో కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే, విచారణకు నిర్దిష్ట సమయం ప్రకటించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates