ఓట‌ర్లే మైనా.. మీకే ఓటేస్తామ‌ని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్

ఏపీ ప్రతిపక్షం వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. “సమయం లేదు. ఇప్పుడు ఏం చేయలేం” అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఉప పోరును టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తమ సత్తా చాటుకునేందుకు వైసీపీ కూడా సై అంది.

ఇదిలా ఉండగా ఓటర్లను స్థానిక పోలింగ్ బూత్‌ల నుంచి రెండునుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ బూత్‌లకు మార్చారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించిన పెద్ద జాబితాను రెడీ చేశారు. ఈ విషయంలో సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

మధ్యాహ్నం 4 గంటల తర్వాత విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎన్నికల అధికారులు, వైసీపీ తరఫున ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది.

ఎన్నికల అధికారుల వాదన ప్రకారం నియోజకవర్గం అత్యంత సున్నితమైన జాబితాలో ఉందని, ఇప్పటికే ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఈ నేపధ్యంలో ఓటర్లను తక్కువ సంఖ్యలో బూతుల‌కు పరిమితం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ క్రమంలో బూతుల సంఖ్యను పెంచి ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాల‌ని వివరించారు.

వైసీపీ తరఫున న్యాయవాదులు ఇది రాజకీయ కుట్ర అని, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు మాత్రమే బూతులను దూరంగా ఏర్పాటు చేశారని వాదించారు.

ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని “మీకనుకూలమని ఎలా నిర్ధారిస్తారు? ఓటర్లే మైనా మీకే ఓటేస్తామని చెప్పారా?” అని ప్రశ్నించింది. దీనికి వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

అయితే ఇప్పటికే సమయం మించిపోయిందని, తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్నందున ఈ సమయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు వైసీపీ పిటిషన్లను తోసిపుచ్చింది.