తెలంగాణలో చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటికప్పుడు పెను కలకలమే రేపుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలకు ముందు విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసి వారి వ్యూహాలను తెలుసుకుని అధికార పార్టీ నేతలు వాటికి ప్రతివ్యూహాలు పన్నినట్టుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయగా.. ఇప్పటికే సిట్ కేసులో కీలక నిందితులను విచారించింది. బాధితులనూ విచారించి సాక్ష్యాలు సేకరించింది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్ కు బండి ఇచ్చిన ఆధారాలు ఈ కేసును సరైన పట్టాల మీదకు తెచ్చినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ కూడా బాధితుడే. 2023 ఎన్నికలకు ముందు బండి సంజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ఇంటిలో పనిచేసేవారు. బండితో సన్నిహితంగా తిరిగే నేతలు, ఆయనను అనుసరించే బీజేపీ కీలక నేతలు… ఇలా చాలా మంది నేతల ఫోన్టను నాటి బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేయించిందట. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం సిట్ విచారణకు హాజరయ్యే ముందు స్వయంగా బండి సంజయే వెల్లడించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో అందరికంటే కూడా తననే అత్యధికంగా టార్గెట్ చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటమే కారణమనీ ఆయన చెప్పుకొచ్చారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే సిట్ విచారణకు వచ్చే ముందు బండి సంజయ్ రెండు బండిళ్ల నిండా ఆధారాలను తీసుకుని వచ్చారు. ఆ బండిళ్లపై ‘కాన్ఫిడెన్షియల్’ అని రాసి ఉంది. అంటే అందులోని సమాచారం అత్యంత కీలకమైనదేనన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం బండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హోదాలో టెలికాం శాఖను సంప్రదించిన ఆయన తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సమగ్ర ఆధారాలను సేకరించినట్లుగా సమాచారం. అదే సమాచారాన్ని ఆయన సిట్ కు ఇప్పటికే సమర్పించారు. ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినది కావడంతో దీనిపై సిట్ ప్రత్యేక దృష్టి సారించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా సాక్షుల హోదాలో సిట్ విచారణకు హాజరైన వారు ఇలా పక్కా ఆధారాలతో కూడిన సమాచారాన్ని సిట్ కు అందించిన దాఖలా లేదు. దీంతో బండి ఇచ్చిన సమాచారంపై మాత్రం సిట్ ప్రత్యేక దృష్టి సారించక తప్పదు. అదే సమయంలో ట్యాపింగ్ కేసులో సిట్ టైం పాస్ చేస్తోందని ఆరోపిస్తున్న బండి, ఇతర బీజేపీ నేతలు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన సిట్ పై భారీ ఒత్తిడి అయితే పెరిగిపోయినట్టే. వెరసి కేసు దర్యాప్తు సరైన ట్రాక్ లోకి రాక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates