ఈసీ వర్సెస్ రాహుల్.. మరింత హీటెక్కింది

కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల మధ్య నెలకొన్నవివాదం అంతకంతకూ ముదురుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సహకారంతోనే విజయం సాధించిందని రాహుల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాహుల్ ఈసీపై సంచలన ఆరోపణలను గుప్పించారు. ఈ ఆరోపణలపై ఈసీ కూడా ఘాటుగానే స్పందించగా.. ఏమాత్రం వెనక్కు తగ్గని రాహుల్ బెంగళూరులో ధర్నాకు దిగి ఈసీకి 5 ప్రశ్నలు సంధించారు. వెరసి ఈసీ, రాహుల్ ల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది.

డిజిటల్ ఓటరు జాబితా తమకు ఎందుకు ఇవ్వడం లేదని ఈసీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ… ఎన్నికల సందర్భంగా రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీలను ఎందుకు, ఎవరి ఆదేశాలతో ఆఘమేఘాల మీద తొలగిస్తున్నారని ప్రశ్నించారు. ఇక ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైందని ప్రశ్నించిన రాహుల్… నకిలీ ఓటర్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల తీరు అనుమానాలు వ్యక్తం చేస్తే… విపక్షాలను ఎన్నికల సంఘం బెదిరించే రీతిలో మాట్లాడుతోందని, ఇదేం తీరు అని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికల క్రతువును నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏజెంటుగా మారిపోయిందా? అని రాహుల్ మరో సంచలన ఆరోపణ గుప్పించారు. 

వాస్తవానికి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఒకింత సుతిమెత్తగా పనిచేస్తోందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి గానీ… ఎన్నికల నిర్వహణలో ఒక్కోకమిషనర్ ఒక్కో రీతిలో వ్యవహరించడం రివాజే. అయినా గతంలో ఎన్నడూ లేని రీతిలో 2024 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై విపక్షాలు ఓ రేంజిలో ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. దీంతో వాటికి సమాధానం చెప్పలేక ఈసీ  ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటోంది. అదే సమయంలో రాహుల్ ఎన్నికల అక్రమాలకు ఆధారాలు ఇవిగో అంటూ ఓ చిట్టాను పట్టుకుని రంగంలోకి దిగడంతో వివాదం మరింత ముదిరిందనే చెప్పాలి.