గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య ఏం జరుగుతోది ? ఇపుడిదే అంశం అందరిలోను చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామంటు జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించేశారు. ప్రకటనతో ఆగకుండా అభ్యర్ధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ కూడా అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసేసింది. ఇంతలో హఠాత్తుగా గురువారం ఓ ప్రచారం మొదలైంది.
అదేమంటే బీజేపీ, జనసేనల మధ్య పొత్తు చర్చలు జరగబోతున్నాయని. పొత్తు చర్చలపై జనసేన అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గురువారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్, బేజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య చర్చలు జరుగుతాయంటు జనసేన తరపున ప్రెస్ నోటీ రిలీజయ్యింది. దీంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జనసేన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తో తమకేమీ సంబంధం లేదని కమలనాదులు తేల్చేశారు. ప్రెస్ రిలీజ్ అయిన సమయంలోనే సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. దాంతో ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించినపుడు ఆ ప్రెస్ రిలీజ్ తో తమకేమీ సంబంధం లేదని తేల్చేశారు.
పైగా గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో తమకు పొత్తు లేదని కూడా చెప్పేశారు సంజయ్. దాంతో జనసేన నేతలు షాక్ కు గురయ్యారు. జనసేన ఏమో పొత్తు చర్చలంటుంది, బీజేపీ నేతలేమో అసలు పొత్తులే లేవంటుంది. రెండు పార్టీల మధ్య అసలేం జరుగుతోందో అర్ధంకాక మధ్యలో ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ తో పాటు మామూలు జనాలు కూడా అయోమయంలో పడిపోయారు. జరుగుతున్నదంతా చూస్తుంటే ఒంటరిపోటీకి పవన్ ఏమన్నా భయపడుతున్నాడా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
నిజానికి గ్రేటర్లో పోటీ చేసేంత సీన్ జనసేనకు లేదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుండి ఏ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయలేదు. పైగా కేసీయార్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే పవన్ భయపడిపోతున్నరనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ కారణంతోనే తెలంగాణాను జనసేన రాజకీయంగా దాదాపు వదిలేసింది. ప్రెస్ మీట్లు పెట్టడం, పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవటం వరకే పవన్ పరిమితమయ్యారు.
ఇటువంటి నేపధ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ తొందరపడి ప్రకటించేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముందుగా ఓ ప్రకటన చేసేస్తే బీజేపీ తెలంగాణాలో కూడా తమతో పొత్తుకు వస్తుందని పవన్ అనుకున్నట్లున్నారు. అయితే అలాంటిదేమీ కనబడలేదు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక బండి సంజయ్ తో పొత్తు చర్చలంటు ఓ ప్రెస్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా బీజేపీ నేతలు పట్టించుకోకపోగా రివర్సులో అసలు పొత్తులే ఉండవంటు కుండబద్దలు కొట్టారు. దాంతో ఇపుడు ఏమి చేయాలో పవన్ కు అర్ధం కావటంలేదట. మరిపుడు పవన్ ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates