ప‌య్యావుల సరిగ్గా పని చేయలేకపొతున్నారా?

పయ్యావుల కేశ‌వ్‌.. రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వంలో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నిజానికి సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నా… ఆయ‌న‌కు ఇప్పుడే.. ఫ‌స్ట్ టైమ్ మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అది కూడా కీల‌క మైన ఆర్థిక శాఖ‌ను ఆయ‌న భుజాన మోస్తున్నారు. దీనికి ఉన్న ఏకైక కార‌ణం.. వైసీపీ హ‌యాంలో ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీకి చైర్మ‌న్‌(ప‌బ్లిక్ అకౌంట్స్‌)గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఆర్థిక వ్య‌వ‌హారాలు ఆయ‌న కు బాగా తెలుసున‌న్న భావ‌న‌తో చంద్ర‌బాబు దీనిని ఆయ‌న‌కు అప్ప‌గించారు.

అయితే.. చిత్రం ఏంటంటే.. ఏడాదికిపైగా ఆశాఖ‌కు మంత్రిగా ఉన్న ప‌య్యావుల ఇంకా త‌డ‌బాట్లు ప‌డు తూనే ఉన్నార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానిస్తుండ‌డం. ఇది వాస్త‌వం. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కాంట్రాక్టు ప‌నుల‌కు బిల్లులు చెల్లించ‌రాద‌ని తీసుకున్న విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాన్ని సైతం ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారులు ప‌క్క‌న పెట్టి వారికి బిల్లులు చెల్లించారు. ఈ విష‌యం కొన్నాళ్ల కింద‌టే పెద్ద ఎత్తున వివాదం అయింది. అయితే.. దీనిని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసి.. మ‌రో పొర‌పాటు చేశారు.

ఇక‌, విశాఖ‌లోని రుషి కొండ‌పై నిర్మించిన ఇంద్ర భ‌వ‌నం లెక్క‌లు తేల‌కుండానే అప్ప‌ట్లోనూ కాంట్రాక్ట‌ర్‌కు బిల్లులు చెల్లించారు. ఇది తీవ్ర అంశ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు అంత‌ర్గ‌త స‌మావేశాల్లోనే చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విష‌యం అస‌లు త‌న దృష్టికి రాలేద‌ని ప‌య్యావుల మీడియా ముందే చెప్పేసి.. చేతులు కాల్చుకున్నారు. వాస్త‌వానికి ఒక శాఖ మంత్రిగా.. ఆయ‌న శాఖ‌లోని అధికారుల‌పై ప‌ట్టు పెంచుకోవాలి. వారిని హ‌ద్దులు దాట‌కుండా చూసుకోవాలి. ఈ విష‌యంలో ఆయ‌న ఏడాది అయినా.. త‌డ‌బాట్లు ప‌డుతూనే ఉన్నారు.

ఇక‌, తాజాగా కూడా మ‌రో పొర‌బాటు చేసి… ఆర్థిక శాఖ వ్య‌వ‌హారాల‌పై.. ఆయ‌న ఇబ్బందులు తెచ్చుకున్నా రనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ర‌హ‌దారుల వెంబ‌డి ఉన్న చెట్ల‌ను న‌రికేశారు. దీనిని జిల్లాల వారీగా కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌గించారు. అయితే.. అప్ప‌ట్లో ఈ బిల్లులు కూడా చెల్లించ‌లేదు. పైగా దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో వైసీపీ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గింది. దీనిని అప్ప‌ట్లో టీడీపీ స‌హా.. అనుకూల మీడియా పెద్ద ఎత్తున త‌ప్పుబట్టింది.

అలాంటి కాంట్రాక్ట్ ప‌నుల‌కు కూడా గుట్టు చ‌ప్పుడు కాకుండా సొమ్ములు చెల్లించేశారు. దీనిపై తాజాగా సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది. అస‌లు ఆర్థిక శాఖ‌లో ఏం జ‌రుగుతోంది? ఏయే అధికారులు ఉన్నారో.. త‌న‌కు వివ‌రాలు ఇవ్వాల‌ని ఆయ‌న ఆదేశించిన‌ట్టు తెలిసింది.