తగ్గేదేలే!…అమెరికాకు భారత్ గట్టి కౌంటర్!

అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు ప్రపంచంలోని చాలా దేశాలు వణికిపోవచ్చు గాక… భారత దేశం మాత్రం నువ్వెంత? నీ పన్నులెంత? అన్నట్టుగా అమెరికా టారిఫ్ లను అలా లైట్ తీసుకుంది. అంతటితో ఆగని భారత్… అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చిపడేసింది. అమెరికాతో కీలకమైన ఆయుదాల కొనుగోలు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుంది. అందులో భాగంగా ముందుగా క్షిపణుల కొనుగోలును నిలిపివేస్తున్నట్లు బారత్ శుక్రవారం మధ్యాహ్నం సంచలన నిర్ణయం తీసుకుంది. మున్ముందు అమెరికాతో జరిగిన ఆయుధ సరఫరా ఒప్పందాలను అన్నింటినీ భారత్ రద్దు చేసుకోనుంది. 

ఇదిలా ఉంటే… త్వరలో భారత రక్షణ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికా టెంపరితనానికి నిరసనగా రాజ్ నాథ్ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అమెరికాతో ఆయుధ కొనుగోలు ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆ దేశంతో పని ఏముందని కూడా రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచిత్ర వైఖరి కారణంగానే ప్రపంచంలో ప్రస్తుతం అశాంతి నెలకొందని కూడా ఆయన నిందించారు. ఓ దేశాధ్యక్షుడి మాదిరిగా ట్రంప్ వ్యవహరించడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

అమెరికాకు రెండో పర్యాయం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా దేశాలపై ట్రంప్ భారీ సుంకాలు విధిస్తూ సాగుతున్నారు. ఈ సుంకాల దెబ్బకు ఆయా దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనా, రష్యాలపై అయితే ట్రంప్ మరీ కక్షగట్టినట్టుగా వ్యవహరించారు. అయితే అమెరికాకు తీసిపోని రీతిలో ఆర్థిక వ్వవస్థలు కలిగిన చైనా, రష్యాలు అమెరికా సుంకాలను లైట్ తీసుకున్నాయి. అదే సమయంలో ప్రపంచ దేశాలను అమెరికాకు దూరం చేయడంతో పాటు తమతో దోస్తీ కట్టేలా వ్యూహం రచిస్తున్నాయి. ఈ వ్యూహాలు కూడా ఓ మోస్తరు ఫలిస్తున్నాయి. తాజాగా భారత్ కు కూడా చైనా, రష్యా గట్టి మద్దతు ఇచ్చాయి. ఈ నెలాఖరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బారత్ లో పర్యటించనున్నారు.

మరోవైపు తాను ఏ మేర సుంకాలు విధించినా భారత్ కిక్కురుమనే పరిస్థితి లేదన్న భావనలో ట్రంప్ ఉన్నారు. అందుకే ఏకంగా 50 శాతం సుంకాలను భారత్ పై విధించారు. ఈ సుంకాలపై భారత్ అంత వేగంగా స్పందించలేదు. ఆచితూచి స్పందించింది. అమెరికా సుంకాలను ఎంతగా పెంచినా తమకు తమ దేశ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని గురువారం ప్రకటించిన మోదీ ప్రకటనను చూసి ట్రంప్… భారత్ తన సుంకాల దెబ్బకు భయపడిపోయిందని భావించారు. అయితే ఆ మరునాడే అమెరికాతో పాటు ట్రంప్ కు గట్టి షాకిస్తూ… అమెరికాతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.