‘జగన్, అవినాష్ ఆధ్వర్యంలోనే వివేకా హత్య’

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. హత్య జరిగి ఇంత కాలం అయినా సీబీఐ విచారణ పూర్తికాకపోవడం వివిధ అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసుపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి.

ఆదినారాయణ రెడ్డి మాటల్లో, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డిల ఆధ్వర్యంలోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నా, ఆయనను హత్య చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఇలాంటి దారుణ ఆలోచన జగన్ మరియు అవినాష్ రెడ్డిలకు రావడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

హత్య జరిగిన రోజున మీడియాను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారని, స్థానిక విలేకరులను కూడా ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించారు. ఇది మొత్తం కుట్రపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోందని అన్నారు. వివేకా హత్య మాదిరిగానే కోడి కత్తి ఘటన ఒక నాటకం అని, విజయవాడలో జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాటకం అని విమర్శించారు.

వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి, కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదిక ఇచ్చానని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివేకా కుటుంబాన్ని కలవలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, వాటిని వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు తెలుసుకున్నారని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు.