‘ముందు ఈ సంగతి చూడండి’.. అంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు సుదీర్ఘ లేఖ సంధించారు. “మీ అవసరానికి రాజకీయాలను వాడుకుంటున్నారు. కానీ, మీ అవసరం ఉంది.. ప్రస్తుతం పంచాయతీల్లో.. ముందు ఈ సంగతి చూడండి.” అని వ్యాఖ్యానించారు. పంచాయతీలు ప్రస్తుతం కోలుకునే దశలో లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా 1121 కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇచ్చిందని.. ఈ సొమ్మును దారిమళ్లించకుండా.. పంచాయతీల అభివృద్దికి కేటాయించాలని శ్రీనివాసరావు సూచించారు.
రాజకీయాలు చేసుకునేందుకు ఎన్నికలు ఇప్పట్లో లేవని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కాబట్టి.. గ్రామ పంచాయతీల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. “మీ శాఖపై మీరు దృష్టి పెట్టకుండా.. కేవలం రాజకీయాలు.. విమర్శలకే పరిమితం అవుతున్నారు” అని వ్యాఖ్యానించారు. సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. పంచాయతీలు నానాటికీ బలహీన పడుతున్నాయని పేర్కొన్న ఆయన అధికార కేంద్రీకరణ జరుగుతోందన్నారు. “పవన్ కల్యాణ్ వచ్చాక.. మెరుగు అవుతాయని అందరూ భావించారు. కానీ, మీరు పట్టీపట్టనట్టే వ్యవహరిస్తున్నారు” అని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో సర్పంచులు ఎన్నికై నాలుగేళ్లు దాటుతోందని పేర్కొన్న శ్రీనివాసరావు.. వారికి విధులు, నిధులు లేక.. ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన మీ మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. చాలా మంది సర్పంచులు అప్పులు చేసి మరీ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారని.. వారు ఆ అప్పులకు వడ్డీలు కూడా భరించాల్సి వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రబుత్వం తాజాగా వచ్చిన నిధులను వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని శ్రీనివాసరావు కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పంచాయితీలకు ఇవ్వవలసిన నిధులు కూడా విడుదల చేయాలన్నారు.
హామీ ఏమైంది..?
మేం వచ్చిన తర్వాత.. సర్పంచుల వేతనాన్ని రూ.మూడు వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని చెప్పారని.. శ్రీనివాసరావు గుర్తు చేశారు.కానీ, ఇప్పటి వరకు వేతనాల గురించిన ప్రస్తావన కూడా లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం అమల్లో గ్రామ పంచాయితీల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates