ఏపీలో కొత్త జిల్లాలు.. నెల రోజులే డెడ్‌లైన్‌!

Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను 32 జిల్లాలుగా మార్చాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తును నెల రోజుల్లోగా పూర్తి చేయాల‌ని తాజాగా సీఎం చంద్రబాబు డెడ్‌లైన్ విధించారు.

వాస్త‌వానికి కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల‌కు ప్ర‌జ‌ల అభిరుచులు, డిమాండ్ల‌కు అనుగుణంగా పేర్ల మార్పు వంటివాటిపై క‌స‌ర‌త్తు చేసేందుకు మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని ఇటీవ‌ల నియ‌మించారు. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా బుధ‌వారం జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో చంద్రబాబు చ‌ర్చించారు. దీనిపై ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు.

వైసీపీ హ‌యాంలో 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మార్చార‌ని.. అయితే ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు, స్థానికంగా ఉన్న సెంటిమెంట్ల‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనివ‌ల్ల ప‌లు ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు జ‌రిగాయ‌ని.. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున ఉద్య‌మాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు.

దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు విఫ‌ల‌మైపోయింద‌ని ఆరోపించారు. తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లిన‌ప్పుడు అనేక డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు.. వారు కోరుకున్న విధంగా బౌండ‌రీ (స‌రిహ‌ద్దులు) నిర్ణ‌యించి.. కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

అయితే.. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం వేసినా.. ఇది ఎప్పుడో నివేదిక ఇవ్వ‌డం కాద‌ని.. వ‌చ్చే నెల రోజుల్లోనే ప‌ని పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌జ‌ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వాట్సాప్ స‌హా సామాజిక మాధ్య‌మాల‌ను విస్తృతంగా వాడుకోవాల‌న్నారు.

అదే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, మండ‌ల‌స్థాయి ప్ర‌జాప్ర‌తినిధుల‌తోనూ చ‌ర్చించి.. కేవ‌లం నెల రోజుల్లోనే త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని ప్ర‌కారం.. కొత్త జిల్లాలు (అవ‌స‌ర‌మైన చోట), అదేవిధంగా జిల్లాల‌కు పేర్లు మార్పు, అలానే జిల్లాక‌ళ స‌రిహ‌ద్దుల ఏర్పాటు వంటివాటిని నిర్దేశిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

ప్ర‌ధానంగా హిందూపురం (బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గం) కొత్త జిల్లాగా ఏర్ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా ప‌ల్నాడు జిల్లా పేరును నాయ‌కురాలు నాగ‌మ్మ లేదా బ్ర‌హ్మ‌నాయుడు లేదా గుర్రంజాషువా పేర్ల‌తో మార్చాల‌న్న డిమాండ్ ఉంది. అలాగే.. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలో రాయ‌చోటి కేంద్రంకాకుండా.. అన్న‌మయ్య జిల్లాను రాజంపేట కేంద్రంగా మార్చాల‌ని పెద్ద ఎత్తున గ‌తంలో ఉద్య‌మాలు జ‌రిగాయి. దీనిని కూడా మార్చే అవ‌కాశం ఉంది.

ఇక ఎన్టీఆర్ జిల్లా పేరును ఆయ‌న పుట్టి పెరిగిన నిమ్మ‌కూరు ఉన్న ప్రాంతం (ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా) ఉన్న జిల్లాకు పెట్టాల‌న్న పేరు ఉంది. ఇలా.. అనేక మార్పుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద పీట వేయ‌నుంది.