గత వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొనే ఉన్నతాధికారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఉపశమనం కలిగింది. వారికి గత ప్రభుత్వంలో నిలిపివేసిన అనేక ప్రయోజనాలను ప్రస్తుతం అందించారు. అంతేకాదు.. వారిలో ఒకరిద్దరికి కీలక పదవులు కూడాఇచ్చారు. అయితే.. వారు సదరు పదవులు తీసుకోలేదు. పైగా.. ఒకరు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కానీ, ఇది ప్రకటించిన తర్వాత.. సదరు అధికారి ప్రాధాన్యం కోల్పోయారు.
దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై.. చూచాయగా విమర్శలు చేస్తూ.. హాట్ హాట్‌గా మారారు. మరో అధికారి ఏకంగా రాజధాని భూములపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీరిద్దరూ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం.. గతంలో… చంద్రబాబు విజన్‌ను వేనోళ్ల పొగిడిన వారే కావడం గమనార్హం. అయితే.. ఎందుకో.. ఇటీవల కాలంలో మాత్రం వారు యూటర్న్‌తీసుకున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా చంద్రబాబు దృష్టి పెట్టారు. వారు సాయం చేస్తున్నారా? ప్రభుత్వంపై సెగ రేపుతున్నారా? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వీరిలో ఒక అధికారి.. గతంలో వైసీపీతో ఢీ అంటే ఢీఅన్నట్టుగా వ్యవహరించారు. రిటైరైన తర్వాత.. కనీసం గౌరవ ప్రదంగా కూడా.. ఆయనను అప్పటి ప్రభుత్వం సాగనంపలేదు. ఇక, కూటమి సర్కారు వచ్చాక.. ఆయనకు ప్రభుత్వం పరంగా రావాల్సిన అన్ని నిధులు ఇచ్చేసింది. అంతేకాదు.. ఆయన కోరకుండానే సీఎం చంద్రబాబు ఓ నామినేటెడ్ పదవిని కూడా ఇచ్చారు. ఇది పోలీసు శాఖలో కీలకమైన పదవి. అయినా.. ఆయన తీసుకోలేదు. పైగా.. బనకచర్ల ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారు. ఇది అవసరమా? అంటూ.. సభలు, సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు.
ఇక, మరో అధికారి.. కూడా గతంలో వైసీపీ అధినేత జగన్‌తోనే నేరుగా పోరాటం చేశారు. అయితే.. ఈయన ఇప్పుడు రాజధాని భూములను సమీకరించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ విషయంలో తాము తటస్థంగా ఉంటామని చెబుతూనే.. మరోవైపు ఎందుకు ఇన్ని భూములు.. ఏం చేస్తారు? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పడేస్తోంది. మేధావి వర్గాల్లో మంచి పేరున్న ఈ ఇద్దరు నేతలు.. మనసులో ఏం పెట్టుకున్నారో తెలియదు కానీ.. సర్కారుపై మాత్రం పరోక్షంగా యుద్ధమే చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates