ఆయన తొలిసారి విజయం దక్కించుకున్నారు. దీంతో పనులు పెద్దగా చేయకపోయినా.. ఎవరూ అడగరు. పైగా.. ఐదుసార్లు గతంలో గెలిచిన ఓ నాయకుడిపై తప్పులు మోపి.. తాను తప్పించుకునేందుకు అవకాశం కూడా ఉంది. అయినా.. సదరు ఎమ్మెల్యే మాత్రం చూస్తూ కూర్చోవడం లేదు. ఎదుటి వారి తప్పులు ఎంచడం కూడా తగ్గించారు. తాను పనిచేసుకుని పోతున్నారు. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆయనే.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను తీసుకువచ్చి.. గుడివాడ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నా రు. వాస్తవానికి రాష్ట్రంలో సగంమందికి పైగా కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్ర సర్కారు ఇచ్చే నిధులపైనే ఆధారపడుతున్నారు. కానీ, కొందరు మాత్రమే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో రాము ముందు వరుసలో ఉన్నారు. గుడివాడ అభివృద్ధికి సహకరించాలని ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఆయన రెండు సార్లు కలుసుకున్నారు.
నియోజకవర్గంలో ప్రధానంగా మురుగునీటి నిర్వహణ, రహదారుల ఏర్పాటుకు ఎమ్మెల్యే రాము ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వేలాది కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులలో గుడివాడను కూడా చేర్చేలా రాము ప్రయత్నించి సక్సెస్ సాధించారు. అదేసమయం లో గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారుల ఎండ్ టూ ఎండ్ అభివృద్ధికి, గుడివాడ – కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు గత పదేళ్లుగా పెండింగులో ఉన్నాయని.. గత నాయకుడు పట్టించుకోలేదని రాము చెబుతున్నారు.
ఈ క్రమంలో అతి త్వరలో కేంద్ర నిధులతో ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నా యి. గుడివాడ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాము చెబుతున్నారు. అలాగే అతి కొద్ది రోజుల్లోనే 8 కోట్ల రూపాయల నిధులతో గుడివాడ పట్టణ వ్యాప్తంగా అనేక రహదారులు, డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలా.. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రానున్న రోజుల్లో గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేలా.. ఇక్కడి సమస్యలు తీర్చేలా.. రాము పరుగులు పెడుతున్నారని అంటున్నారు స్థానికులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates