తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన.. ప్రాజెక్టుల వెనుక అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని.. సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై నియమితులైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మంత్రి వర్గంలో చర్చించారు. అనంతరం.. ఈ కమిషన్ సహా.. అధ్యయన కమిటీ ఇచ్చిన రెండు నివేదికల(ఘోష్ కమిటీ 620 పేజీలు, అధ్యయ కమిటీ 62 పేజీలు)ను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. “అసెంబ్లీ సాక్షిగా.. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని ప్రజలకు వివరిద్దాం.” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులలోనూ భారీ అవినీతి జరిగిందని కమిషన్ రిపోర్టు స్పష్టం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే గత ముఖ్యమంత్రి వీటి ప్లానింగులు, డిజైన్లను కూడా మార్చేశారని అన్నారు. వీటిపై ప్రజల్లోనే ఎక్కువగా చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు నాలుగు రోజులు కేటాయించేలా స్పీకర్‌ను కోరనున్నట్టు తెలిపారు. చర్చ జరిగిన తర్వాతే.. నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నివేదికలపై ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు.
ప్రజాధనాన్ని మింగేశారు!
మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని ఆబగా మింగేశారని.. పట్టుమని మూడు నాలుగు మాసాలు కూడా కాకుండానే మేడిగడ్డ కుంగిందని.. దీనికి తాముబాధ్యుల కాదని ఎలా తప్పించుకుంటారని ఆయన పరోక్షంగా బీఆర్ ఎస్ అధినేతపై విమర్శలు గుప్పించారు. “వాస్తవాలు ప్రజలకు తెలియాలి. తెలంగాణ సెంటిమెంటును పట్టుకుని.. ప్రజల రక్తాన్ని, డబ్బులను కూడా దోచుకున్న వైనాన్ని చర్చకు పెడతాం. ప్రజలు ఎలాంటి సలహాలు, సూచనలు చేసిన తీసుకుంటాం. దీనిపై చర్చ జరిగి తీరాల్సిందే. అసెంబ్లీలో నాలుగు రోజులు కాదు.. నలభై రోజులైనా దీనిపై చర్చిస్తాం.” అని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates