తండ్రి ఫ్యామిలీకి కవిత దూరమైనట్టేనా?

kavitha

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఇటీవల మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కేసీఆర్ కుమార్తె కవిత తనకు చట్టసభల్లో అవకాశం కల్పించిన పార్టీని విమర్శిస్తూ సాగుతున్నారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునే క్రమంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి కవిత దూరంగా ఉన్నారు.

గత నెలలోనే జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అందుకు కారకులు కూడా వీరేనని ఆయన తన నివేదికలో విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ నివేదక తెలంగాణలో కలకలం రేపుతుండగా… బీఆర్ఎస్ లో అయితే ఏకంగా తీవ్ర భయాందోళనలనే రేకెత్తిస్తోంది. ఈ నివేదిక నుంచి ఉపశమనం పొందేదెలా అన్న దిశగా సోమవారం ఉదయం ఎర్రవలి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీకి చెందిన కీలక నేతలందరితో భేటీ అయ్యారు. ఈ భేటీకి పార్టీకి చెందిన కీలక నేతలంతా రాగా…కవిత మాత్రం అక్కడకు వెళ్లలేదు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆమె సోమవారం దీక్షకు దిగారు. మూడు రోజుల ఈ దీక్షను కోర్టు సూచనతో కవిత ఒక్కరోజులోనే ముగించేశారు. దీక్ష ముగించిన తర్వాత కూడా ఆమె తన తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లిన దాఖలా కనిపించలేదు. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ నివేదిక నుంచి తన తండ్రికి పొంచి ఉన్న ముప్పు తదితరాలపై కవిత ఏమాత్రం పట్టించుకోనట్టుగానే ఉంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతల మాటలు, మంటలను కవిత ఎంతమాత్రం లెక్క చేయకుండానే సాగుతున్నారు.

ఇప్పటికే తన సోదరుడు కేటీఆర్ ఆధిపత్యంపై తిరుగు బావుటా ఎగురవేసిన కవిత.. తాను స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను వేదికగా చేసుకుని రాజకీయంగా ఎదిగేందుకు యత్నిస్తున్నారు. అయితే ఆమె బీఆర్ఎస్ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవిని మాత్రం వదలడం లేదు. బీసీ నినాదంతో వచ్చే ఎన్నికల నాటికి జాగృతిని బలోపేతం చేసి రాజకీయంగా కేటీఆర్ కు దీటుగా నిలవాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె తన తండ్రికి, తండ్రి కుటుంబానికి దూరమయ్యేందుకు కూడా వెనుకాడటం లేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.