వైసీపీ ప్రచారం పై బాబు నివేదిక ఏమంటుందంటే

“ఔను.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ దాదాపు 99 శాతం మందికి అందింది” అని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు నివేదికలు పంపారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం, ఈ పథకం అమలైన తర్వాత 48 గంటల్లో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌లకు సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో అధికారులు జిల్లాల స్థాయిలో రిపోర్టులను పరిశీలించి, నివేదికను సీఎం కార్యాలయానికి పంపించారు.

ఎందుకు?

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ యోజనలను కలిపి, ఏపీ ప్రభుత్వం 46 లక్షల మందికి పైగా రైతులకు సోమవారం నిధులు జమ చేసింది. ఒక్కొక్క రైతుకు రూ.5000 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి కేంద్రం ఇచ్చిన రూ.2000 కలిపి మొత్తం రూ.7000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

అయితే దీనిపై వైసీపీ సహా కమ్యూనిస్టు పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. రైతులకు రూ.20 వేలు ఇస్తామన్నట్టు చెప్పి చివరికి కేవలం రూ.5000 ఇచ్చారని, చాలా మందికి నిధులు అందలేదని విమర్శలు గుప్పించారు. రైతులు సంతోషంగా లేరని వైసీపీ అధినేత జగన్ అదే రోజు 14 ప్రశ్నలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్‌లో టార్గెట్ చేశారు. తాము ఉన్నప్పుడు రైతులకు మేలు జరిగిందని, ఇప్పుడు వారిపై దగా చేస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. నిజంగానే రైతుల్లో హర్షం ఉందా లేదా అన్న అంశంపై స్పష్టత కోసం కలెక్టర్లతో చర్చించి వెంటనే నివేదికలు పంపాలన్నారు.

తాజాగా సీఎం డ్యాష్‌బోర్డుకు కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, అన్ని జిల్లాల్లో దాదాపు 99 శాతం మంది రైతులకు నిధులు అందాయని, ఉప ఎన్నికలు జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు. నిధులు సమయానికి వచ్చాయని రైతులు సంతోషంగా ఉన్నారంటూ స్పష్టం చేశారు.