ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత రఘురామకృష్ణరాజు (ఆర్ ఆర్ ఆర్)పై కేసు పెట్టి తప్పు చేశానని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మహమ్మద్ ఫరూక్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ కేసును కొనసాగించే అవకాశం తనకు లేదన్నారు. అందుకే ఆయనపై నమోదు చేసిన కేసు సహా కోర్టులో వేసిన పిటిషన్లను కూడా వెనక్కి తీసుకుంటున్నానని ఆయన సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం తుది నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది. దీంతో ఈ కేసులో రఘురామకు ఊరట లభించినట్టు అయింది.
ఏంటి కేసు?
రఘురామకృష్ణరాజు 2019 నుంచి 2024 వరకు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేసి కస్టడీలో హింసించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లోని స్వగృహానికి వెళ్లిపోయారు.
కానీ, వైసీపీ ప్రభుత్వం అక్కడ కూడా ఆయనను వెంటాడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు కానిస్టేబుల్ ఫరూక్ మఫ్టీలో రఘురామ ఇంటి వద్ద పహారా కాశారు.
దీనిని గుర్తించిన రఘురామ కుమారుడు భరత్ తమ సిబ్బందితో ఫరూక్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి (అప్పటికి అతను కానిస్టేబుల్ అన్న విషయం తెలియదు) స్థానిక పోలీసులకు అప్పగించారు. అలాగే తమ ప్రాణాలకు హాని కలిగించేందుకే ఫరూక్ అక్కడకు వచ్చారని కేసులో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
ఫరూక్ తాను ఇంటెలిజెన్స్ పోలీసునని, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే అక్కడ పహారా కాశానని చెప్పారు. తనను కొట్టిన రఘురామ, భరత్‌లపై ఆయన ఎదురు కేసు పెట్టారు. ఈ రెండు కేసులు ఒకే పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి.
రఘురామ వేసిన కేసును పక్కన పెట్టిన అప్పటి పోలీసులు, ఫరూక్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంతో రఘురామ హైకోర్టును ఆశ్రయించి తమ కేసును పక్కన పెట్టడం ఎలా అని ప్రశ్నించారు. కానీ హైకోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.
దీంతో రఘురామ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఫరూక్ పెట్టిన కేసును సవాల్ చేశారు. తాజాగా విచారణ సందర్భంగా ఫరూక్ తన న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. తాను తప్పు చేశానని, రఘురామ, భరత్‌లపై కేసు పెట్టే ఉద్దేశం లేదని, దాన్ని వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates