వెంకటేశ్ నాయుడు… వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్య స్నేహితుడిగా పరిచయమై.. ఏపీ లిక్కర్ స్కాంలో అందరి కంటే కీలక భూమిక పోషించిన వ్యక్తిగా ఇప్పుడు ఓ రేంజిలో ఈయనకు హైప్ వచ్చేసింది. మొన్నటిదాకా ఈయన ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా నిండా ఈయన గారి వింతలు, విశేషాలు, జల్సాలు, నోట్ల కట్టల లెక్కింపులు… అబ్బో ఒకటా, రెండా లెక్కలేనన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.
చెవిరెడ్డి మాదిరే చంద్రగిరికే చెందిన ఈ నాయుడు వైసీపీ అధికారంలో ఉన్నంతదాకా తన బాల్య స్నేహితుడు చెవిరెడ్డితో పాటు వైసీపీ అధినేత జగన్ తోనూ సన్నిహితంగానే మెలిగారు. ఇక ఎప్పుడైతే వైసీపీ అధికారం నుంచి దిగిపోయిందో.. చెవిరెడ్డి చేయిని అయితే విడవలేదు గానీ… వైసీపీతో దోస్తానాను వదిలి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ నేతలతో వరుస భేటీలు వేస్తూ సాగుతున్నారు. టీడీపీ, బీజేపీ నేతలతో ఆయన అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలు ఇప్పుడు అందరినీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
రాజకీయ పార్టీల మధ్య, వ్యాపార సంస్థల మద్య రాయబారాలు నడిపే మీడియేటర్లు (అచ్చంగా చెప్పాలంటే బ్రోకర్లు)గా సుఖేశ్ చంద్రశేఖర్, నీరా రాడియాలు ఆ మధ్య దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. తీహార్ జైలులో సేదదీరుతున్న సుఖేశ్ అయితే ఇప్పటికీ జైలు నుంచే రాయబారాలు నడుపుతున్నారు. ఇక మాంసం వ్యాపారి మహ్మద్ అలీ పలుమార్లు సీబీఐ డైరెక్టర్ ఇంటికి వెళ్లిన వ్యవహారం కూడా దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడు మన నాయుడు వ్యవహారం చూస్తుంటే… ఇప్పటిదాకా బయటకు వచ్చిన రెండు వీడియోలతోనే ఆయన ఇంతగా వైరల్ అయిపోతే…మరిన్ని వీడియోలు వస్తే ఇంకెంతగా పాపులర్ అవుతారో?
రాజకీయ నాయకులతో సంబంధాలతోనే వెంకటేశ్ నాయుడు ఆగిపోలేదు. సినీ తారలతోనూ ఆయన చెట్టాపట్టాలేసుకుని మరీ విహరించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఏపీ రాజకీయ నేతలతో పాటు తెలంగాణకు చెందిన కీలక నేతలతోనూ ఆయన దిగిన ఫొటోలు కలకలమే రేపుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియాతో కలిసి నాయుడు ప్రత్యేక విమానంలో విహరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇక నాయుడి ఫోన్ ను పూర్తిగా డీకోడ్ చే్స్తే ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates