కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అంటే ఆ ఇద్దరికీ ఎంత భక్తో మాటల్లో వర్ణించలేం. అలాంటి వారిద్దరి మధ్య ఇప్పుడు స్వామి వారి దర్శనం గురించే వివాదం నెలకొంది. స్వామి వారి దర్శనాన్ని భక్తులకు మరింత వేగిరంగా కల్పించేందుకు శ్రమిస్తున్నామని ఒకరంటే… అది అసాధ్యమని, ఆ తరహా ప్రయత్నాలు మానుకోవాలని, అవన్నీ కూడా వృథా ప్రయత్నాలేనని మరొకాయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక శీఘ్ర దర్శనంపై కసరత్తు చేస్తున్న తొలి భక్తుడు ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.
వీరిలో తొలి భక్తుడు టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు కాగా… టీటీడీకి దఫదఫాలుగా ఈవోగా పనిచేసిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం. టీటీడీ చరిత్రలో కొందరు చైర్మన్లు, ఈవోలు ఉన్న సమయంలో భక్తులకు ఎన్నెన్నో మంచి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. స్వామి వారికి కైంకర్యాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాంటి సందర్భాల్లో ఎల్వీ టీటీడీ ఈఓగా పనిచేసిన కాలం కూడా ఒకటి. ఇప్పుడు కూడా బీఆర్ నాయుడు తనదైన ముద్ర వేస్తూ సాగుతున్నారు.
సరే.. ఇదంతా బాగానే ఉన్నా… ఇక అసలు వివాదంలోకి వెళితే… ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల వస్తున్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించే దిశగా నాయుడు శ్రమిస్తున్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు నిత్యం పఠిస్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగించుకుని స్వామి దర్శనాన్ని శీఘ్రం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలతో చర్చలు జరపగా… ఆ సంస్థలు తమ సొంత ఖర్చుతో ఆ పని చేసిపెడతామని ముందుకు వచ్చాయి. త్వరలోనే దీనిపై కసరత్తు మొదలుకానుంది.
ఇదే సమయంలో తిరుమల వచ్చిన ఎల్వీ… గంటలో స్వామి వారి దర్శనం కల్పిస్తామని భావించడం అసంభవమని ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఈ దిశగా చేసిన చాలా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, గతానుభవాలను దృఫ్టిలో పెట్టుకుని ఈ ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సూచించారు. అసలు ఈ తరహా ప్రయత్నాలను ఆయన వృథా యత్నాలుగా కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే స్వామి వారి దర్శనం కొనసాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ఏఐ వినియోగానికి వినియోగించే నిధులను భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలని సూచించారు.
ఎల్వీ వ్యాఖ్యలు చెవిన పడిన వెంటనే బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. ఎల్వీ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ఆయన కుండబద్దలు కొట్టారు. భక్తులకు కేవలం 2 గంటల్లో స్వామి వారి దర్శనాన్ని కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. గూగుల్, టీసీఎస్ సంస్థలు తమ సొంత ఖర్చుతో ఈ ఏర్పాట్లను చేస్తున్నాయని, ఇందులో టీటీడీ సొమ్ము నయా పైసా లేదని ఆయన తెలిపారు. అయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులను స్వామి వారి దర్శనం కోసం షెడ్లు, కంపార్ట్ మెంట్లలో గంటలు, రోజుల తరబడి వేచి చూసేలా చేయడం ఎంతవరకు సబబని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ఈ వివాదం ఇంతటితోనే ఆగుతుందా? మరింత రాజుకుంటుందా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates