తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా.. ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్లు చేశారు. ‘అయితే.. ఏమైతది!’ అని ప్రశ్నించారు. అంతేకాదు, ‘మీరు(మీడియా) చేస్తున్న హడావుడే ఎక్కువగా ఉంది. కోర్టు కాగ్నిజెన్స్(ఆధారాలు) తీసుకోమని చెప్పి రెండు రోజులైతంది. మీరు గిప్పుడు రాసిన్రు.. ఏమైతది?.. ఏమైతది? రాయండి.’ అని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు అనంతరం.. మీడియాతో మాట్లాడిన మంత్రి.. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. అయితే.. తప్పు ఎవరు చేశారు? అనేది పూర్తిగా తేలాలంటూ.. కేటీఆర్‌ను పరోక్షంగా ఆమె మరోసారి కార్నర్ చేశారు.
‘ఉన్నదే మాట్లాడానని నేనంటా. లేదు. నాపై అభాండాలు వేశామని అవతలోల్లు అంటారు. ఏదైనా ఉంటే చట్టం చేస్తది. చట్టం తన పనితాను చేస్తుంది. ఏమైతది?’ అని సురేఖ వ్యాఖ్యానించారు. తాను అనేక కష్టాలు, నష్టాలు ఓర్చుకుని రాటు దేలిపోయి నట్టు మంత్రి చె్పారు. తనకు పోట్లాటలు, కొట్లాటలు కొత్తవి కాదన్న ఆమె.. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ ఎస్ వరకు.. కూడా పోరాటాలతోనే తన రాజకీయ జీవితం గడిచిపోయిందన్నారు. ఏకేసులో అయినా.. కాగ్నిజెన్సు తీసుకోవాలనే కోర్టులు చెబుతా యన్నారు. దీనిని పెద్ద విషయంగా ఆరోపిస్తూ.. నాపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా ఓ వర్గం మీడియా తనను కార్నర్ చేస్తోందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కొందరి ఉత్సాహం చూస్తే.. రాజకీయ నాయకులుగా తమకు ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తూనే ఉంటుందన్నారు. బిగ్ బ్రేకింగులు.. షార్ప్ న్యూస్ అంటూ.. హడావుడి చేస్తరని.. తీరా చూస్తే..అవి సద్ది వార్తలేనని తనదైన శైలిలో ఆమె వ్యాఖ్యానించారు. కేసులో ఏముందో తాను తన వాదనను వినిపించుకునే ముందు.. అసలు కేసుకు కారణాలపైనా విచారణ జరగాలని.. పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని సురేఖ ప్రస్తావించారు. ఈ విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకునేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్టు చెప్పారు. కోర్టు తీర్పు అనంతరం.. శనివారం రాత్రి ఆమె వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates