సమంత విషయంలో కొండా సురేఖ పై కేసు పెట్టండి: కోర్టు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌పై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే తామే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై మంత్రి సురేఖ గత ఏడాది సెప్టెంబర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అప్పట్లోనే ఖండించిన కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తనకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించారు.

ఈ క్రమంలోనే కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంపై విమర్శలు గుప్పించారు. “మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే… ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? దండగ?” అని ప్రశ్నించారు. అనంతరం కొండ సురేఖ తన వ్యాఖ్యలను మరోసారి కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో కేటీఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై అనేక మార్లు విచారణలు జరిగాయి. ఒక దశలో కోర్టు మంత్రిని రావాలంటూ సమన్లు జారీ చేసింది. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని చెబుతూ కోర్టులో మరో పిటిషన్ వేశారు మంత్రి. చివరకు శనివారం ఈ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు ఇస్తూ ఈ నెల 21లోగా మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించింది.
ఏంటా వ్యాఖ్యలు

సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై గత ఏడాది స్పందించిన కొండా సురేఖ నాగచైతన్య–సమంత విడాకుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత–నాగచైతన్య విడిపోయారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కేటీఆర్ కారణంగానే సమంత కాపురంలో చిచ్చు రేగిందని, ఆయన ఫోన్లు విన్నారని, దీనివల్లే నాగచైతన్య–సమంతల మధ్య విభేదాలు వచ్చాయన్నారు. మీడియాలో కూడా రాయలేని వ్యాఖ్యలు అప్పట్లో ఆమె చేశారు. ఈ వ్యాఖ్యలపైనే కేటీఆర్ సీరియస్ అయ్యారు. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కోర్టును ఆశ్రయించారు.