భారత దేశ చరిత్రలో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా ఓ మాజీ ప్రధాని మనవడికి జీవిత ఖైదు పడింది. ఆయనే మాజీ ప్రధాన మంత్రి, కర్ణాటకకు చెందిన దేవెగౌడ మనవడు, మాజీ మంత్రి రేవణ్ణ పెద్దకుమారుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్. ఇంట్లో వంట మనిషిపై పలు మార్లు అత్యాచారం చేసిన కేసులో ప్రజ్వల్‌ను దోషిగా తేలుస్తూ.. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు.. శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తీర్పును వెలువరించింది. అత్యంత ఉత్కంఠ నడుమ ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయాధికారి.. సంతోశ్ గజానన హెగ్డే.. ప్రజ్వల్‌కు జీవిత ఖైదును విధిస్తున్నట్టు తీర్పు వెలువరించారు.
ఏడాదిన్నరలో తేల్చేసి..
గత ఏడాది పార్లమెంటుఎన్నికల సమయంలో ప్రజ్వల్.. హాసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. అప్పటికే ఆయన ఎంపీ అన్న విషయం తెలిసిందే. సొంత పార్టీ జేడీఎస్ తరఫున ఆయన రెండోసారి రంగంలోకి దిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జేడీఎస్‌పై ఒకప్పటి మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక విమర్శలు తెరమీదికి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రజ్వల్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఇంట్లో వంట మనిషిపై అత్యాచారం చేయడంతోపాటు.. సదరు ఘటనను వీడియోలు తీసి.. పోర్న్ సైట్లలో పోస్టు చేశారన్నది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే.. ఆయన జర్మనీకి పారిపోయారు.
అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుతోపాటు.. ప్రజ్వల్‌పై మైసూరు సహా.. యశ్వంతపూర్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల పై ప్రస్తుతం విచారణ సాగుతోంది. అయితే.. ఇంట్లో వంటమనిషి పై జరిపిన అత్యాచారం, వీడియోలు తీయడం.. వంటి కేసుపై ప్రస్తుతం తీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రజ్వల్‌ను దోషిగా తేల్చిన స్థానిక కోర్టు.. జీవిత ఖైదును విధించింది. కాగా.. ఒక మాజీ ప్రధాని మనవడికి దేశంలో ఇలాంటి శిక్ష పడడం, పైగా మహిళలపై అత్యాచారం కేసును ఎదుర్కొనడం ఇదే తొలిసారి..
ఇక్కడ చిత్రం ఏంటంటే.. ప్రజ్వల్ రేవణ్ణ బాబాయి.. కుమారస్వామి ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా వున్నారు. జీవిత ఖైదుతో పాటు.. 10 లక్షల జరిమానా కూడా విధించిన కోర్టు దీనిలో 7 లక్షలను బాధిత వంట మనిషికి ఇవ్వాలని.. మిగిలిన మూడు లక్షలు.. అనాథ మహిళల సేవాశ్రమాలకు ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. ఇక, ఈ కేసుతోనే ప్రజ్వల్ దారుణాలకు తెరపడలేదు. మరో రెండు కేసులు విచారణలోనే ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates