దేశంలోని హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటిని మీరి హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లు చాలామందే ఉంటారు. అందులోనూ సోషల్ మీడియా కాలంలో పరిమితులు తెలియకుండా ప్రవర్తించే వాళ్లకు కొదవే లేదు. రీల్స్, షార్ట్స్ ద్వారా పాపులర్ కావడం కోసం తిరుమల ఆలయం ముందు.. మాడ వీధుల్లో వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.
రోజు రోజుకూ ఈ వేషాలు శ్రుతి మించుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో ఇకపై ఎవరైనా రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ‘‘ఇలాంటి చర్యలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది.. ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతాం’’ అని టీటీడీపీ ఓ ప్రకటనలో తీవ్రంగానే హెచ్చరించింది.
రీల్స్, షార్ట్స్ పిచ్చితో జనం విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారన్నది స్పష్టం. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా.. ప్రతిదీ వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తిరుమలకు వచ్చామని చెప్పడానికి ఫొటోలు, వీడియోలు తీయడం వరకు ఓకే కానీ.. డ్యాన్సులు చేయడం, శ్రుతి మించి ప్రవర్తించడమే టీటీడీ హెచ్చరికలకు కారణం.
Gulte Telugu Telugu Political and Movie News Updates