సహజంగానే రాజకీయాలు సామాజిక వర్గాలకు అనుకూలంగా మారాయి. ఎవరు కాదన్నా.. ఔనన్నా.. సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అంటే.. వైసీపీ, కమ్మ వర్గం అంటే టీడీపీ అనుకునే పరిస్థితి దశాబ్దంన్నర నుంచి కనిపిస్తోంది. అయితే.. కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత.. రెడ్డి వర్గంలో కనిపించడంలేదు.
2019 ఎన్నికలకు ముందు రెడ్డి వర్గం ఏకమైంది. కానీ.. తర్వాత.. జగన్ తమకు ఏమీ చేయలేకపోయారన్న వాదన, ఆవేదనతో ఆ వర్గం దూరమైంది.
ఆ పరిణామాలే.. 2024 ఎన్నికల్లో టీడీపీకి రెడ్డి సామాజిక వర్గం కనెక్ట్ అయ్యేలా చేశాయన్న వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఏడాది తర్వాత కూడా రెడ్డి వర్గం వైసీపీకి దూరంగానే ఉండడం.. కనీసం వారిలో సింపతీ కూడా కనిపించకపోవడం వంటివి వైసీపీలో చర్చకు వస్తున్నాయి.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురు కీలక నాయకులను మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. వీరిలో జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే.. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు.
అయితే.. మిథున్‌రెడ్డి అరెస్టు తర్వాత.. ఆయన తండ్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రెడ్డి సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి.. ప్రభుత్వంపై పోరాటాలు చేసేలా.. విమర్శలు గుప్పించేలా చేయాలని భావించినట్టు వార్తలు వచ్చాయి.
పుంగనూరులో రెడ్డివర్గాన్ని ఐక్యం చేసేందుకు కూడా ఆయన ప్రయత్నించారని తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే తన కుమారుడిని అరెస్టు చేయించారని.. జైల్లో పెట్టించారని పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లంతా ఏకమై, దీనిని ఖండించాలన్నది పెద్దిరెడ్డి ఉద్దేశం. కానీ, పెద్దిరెడ్డి అనుకున్నట్టుగా ఆయన ఆశించినట్టుగా ఏదీ జరగలేదు. పైగా.. ఎవరూ కూడా మిథున్‌రెడ్డి విషయాన్ని ప్రస్తావించేందుకు ముందుకు రాలేదు.
పక్కా ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు చెబుతుండడంతోపాటు.. కేసు కూడా విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మిథున్ రెడ్డిని సమర్ధించడం వల్ల ప్రయోజనం లేదన్న వాదన..
అధికారంలో ఉన్నప్పుడు.. తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాని పెద్దిరెడ్డి.. ఇప్పుడు తన కుటుంబ సమస్యను రెడ్డి వర్గంపై రుద్దుతున్నారన్న చర్చ కూడా ఉంది.
అందుకే రెడ్డి సామాజిక వర్గంలో సింపతీ కరువైందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates