ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్‌లతో కలిసి నాలుగు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఆయన సింగపూర్‌లో ఉన్నారు. బుధవారం సాయంత్రం(స్థానిక కాలమానం ప్రకారం) 5 గంటలకు ఆయన తన పర్యటనను ముగించుకున్నారు. తిరిగి హైదరాబాద్‌కు, అటు నుంచి అమరావతికి చేరుకుంటారు. అయితే.. ఈ ఐదు రోజుల పర్యటన వెనుక.. చంద్రబాబు లక్ష్యం నెరవేరిందా? ఆయన అనుకున్నది సాధించారా? అనేది కీలక ప్రశ్న. వాస్తవానికి చంద్రబాబుకు సింగపూర్ కొత్తకాదు. గత ఏడాది కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సింగపూర్ వెళ్లారు.
సీఎంగా 4.0 పాలన ప్రారంభించిన తర్వాత.. సింగపూర్‌లో పర్యటించడం.. ఇది రెండోసారి. ఈ దఫా పూర్తిగా పెట్టుబడులు, అమరావతి రాజధాని ప్లాన్లు, అక్కడి తెలుగు డయాస్పోరా ప్రతినిధులు, ప్రజలతో భేటీ, పీ-4కు వారి సహకారం.. వంటి కీలక అంశాలను అజెండాగా పెట్టుకుని సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించారు. తొలిరోజు శనివారం(26వ తేదీ) నుంచి ఆయన బిజీ బిజీగా గడిపారు. తెలుగు ప్రజలను కలుసుకున్నారు. పీ-4 పథకానికి వారు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా విశాఖ, అమరావతిలో ఏర్పాటు చేసే ఐటీ పరిశ్రమలకు తోడ్పాటును అందించాలన్నారు.
అదేవిధంగా ప్రముఖ సింగపూర్ కంపెనీలతోనూ.. చంద్రబాబు బృందం భేటీ అయింది. అక్కడి మంత్రులను, ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నంతోనూ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మరింత సాయం కోరారు. అలాగే సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించిఏపీకి పంపించాలని కోరారు. ఇక, పారిశ్రామిక వేత్తలతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. సింగపూర్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్.. తెలుగు వాడైన మోహన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వ విద్యాలయం గురించి ఆయనకు వివరించారు.
ఏఐలో ఇన్నోవేషన్ కేంద్రాలను కూడా ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ .. విశాఖలో ఇన్నోవేషన్ కేంద్రాలు, క్వాంటమ్ వ్యాలీ సహా.. ఇతర సంస్థలను కూడా తీసుకువస్తున్నామన్నారు. వీటికి సహకారం అందించాలని మోహన్ ను కోరారు. భారత్‌కు చెందిన, సింగపూర్‌లో స్థిరప డిన కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు చెందిన ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. అదేవిధంగా మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమ్‌సెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ చంద్రబాబు చర్చించారు. ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.
లోకేష్ కూడా..
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా.. ప్రత్యేకంగా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ఐటీ రంగానికి చెందిన వారితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని.. పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అయితే.. ఈ పర్యటనలో ఇతమిత్థంగా ఇంత మేరకు పెట్టుబడులు వస్తాయని నిర్ధారణ చేసుకోకపోయినా.. చాలా మంది పారిశ్రామిక వేత్తలు, ఏఐ దిగ్గజ సంస్థలు ఏపీపై ఆసక్తి చూపించాయి. చంద్రబాబు విజన్ 2047ను ప్రశంసించాయి. త్వరలోనే ఏపీలో సందర్శిస్తామని.. పలువురు హామీలు ఇచ్చారు. సో.. దీనిని బట్టి చంద్రబాబు చేసిన ప్రయత్నం సాకారం అయిందనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates