వైసీపీ అధినేత జగన్ తాజాగా గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అయితే.. ఆయన పర్యటనలకు భారీగా కార్యకర్తలను పోగు చేస్తుండడం.. దీంతో తొక్కిసలాటలు, వంటివి జరిగే ప్రమాదం ఉంటుందని పోలీసులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఆంక్షలు కూడా పెడుతున్నారు. అయినప్పటికీ.. జగన్ సహా వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఈ ఆంక్షలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిణామమే రెంటపాళ్లలో చోటు చేసుకుని సింగయ్య అనే వైసీపీ కార్యకర్త.. ఏకంగా జగన్ కాన్వాయ్ కిందే పడి చనిపోయారు.
ఇక, ఆ తర్వాత చేపట్టిన పర్యటన ఇదే కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. ఈయనను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అయితే ఈ సమయంలోనూ భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించేందుకు నాయకులు ప్రయత్నించారు. కానీ, జిల్లా పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. పలువురు నాయకులు కార్యకర్తలకు వాట్సాప్ మెసేజ్‌లు పంపించి.. రెచ్చగొట్టి మరీ రప్పించే ప్రయత్నాలు చేశారు.
దీంతో వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై నిఘాను ముమ్మరం చేసిన పోలీసులు మూడు విధాలుగా వారి దూకుడు అడ్డుకట్ట వేశారు.
డ్రోన్స్ నిఘా: డ్రోన్ కెమెరాలను వినియోగించి వైసీపీ కార్యకర్తలు వస్తున్న మార్గాలను తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత మంది పోలీసులను వినియోగించి వారు రాకుండా అడ్డుకున్నారు.
కీలక నేతలను ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. దీంతో పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించుకున్నవారు ఇంటికే పరిమితం అయ్యారు.
నాయకులు వస్తున్న రహదారులపై గుంతలు తవ్వించారు. దీంతో వారు కూడా రోడ్డు దాటే అవకాశం లేక వెనక్కి వెళ్లిపోయారు.
ఇలా మొత్తంగా వైసీపీ దూకుడుపై పోలీసులు తమదైన శైలిలో కళ్లెం వేశారు. దీంతో జగన్ పర్యటన పార్టీ పరంగా చప్పగా సాగినా.. శాంతి భద్రతల పరంగా ఇబ్బందులు తలెత్తలేదని పోలీసులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates