బాబు పెట్టుబ‌డుల‌ వేట‌.. జ‌గ‌న్ పొలిటిక‌ల్ వేట‌!

భూమి త‌న చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. త‌ద్వారానే రేయింబ‌వ‌ళ్లు ఏర్పడుతున్నాయి. అలా.. చంద్ర‌బాబు ఒక‌వైపు.. రాష్ట్రంలో పాల‌న చేస్తూ.. మ‌రోవైపు.. పెట్టుబ‌డుల వేట కొన‌సాగిస్తున్నారు. దావోస్ స‌హా.. ఎక్క‌డ ఏవేదిక క‌నిపించినా.. పెట్టుబ‌డుల‌పై ప్ర‌త్యేక ఆహ్వానాలు ప‌లుకుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో నిర్వ‌హించిన సీఐఐ స‌ద‌స్సు అయినా.. త‌ర్వాత‌.. తాజాగా వెళ్లిన సింగ‌పూర్ అయినా.. ల‌క్ష్యాలు ఒక్క‌టే.. అర్జునుడికి పిట్ట క‌న్ను మాత్ర‌మే క‌నిపించిన‌ట్టుగా.. బాబుకు పెట్టుబ‌డులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి.

అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను కూడా ఆయ‌న నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సూప‌ర్ 6 ప‌థ‌కాల‌ను దాదాపు ప‌ట్టాలెక్కించారు. ఆగ‌స్టు 15 నుంచి కీల‌క‌మైన ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా.. అటు అభివృద్ధి, పెట్టుబ‌డులు, ఇటు సంక్షేమం.. అన్న‌ట్టుగా చంద్ర‌బాబు ప‌రుగులు పెడుతున్నారు. మ‌రి విప‌క్ష నాయ‌కుడిగా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి మేలు చేసే ప‌నులు ఒక్క‌టైనా చేస్తున్నారా? అంటే.. ప్ర‌శ్న‌లే మిగులుతున్నాయి.

“మీరు బుక్కులు రాసుకోండి. మ‌నం వ‌చ్చాక‌.. జైళ్ల‌లో పెడ‌దాం.“ అంటూ.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను రెచ్చ‌గొట్టే ప‌ని చేస్తున్నారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వద్దంటూ.. ఆన్‌లైన్ యుద్ధ‌మే చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ‌, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి తెలిసి కూడా.. ప్ర‌జ‌ల‌ను రెచ్చ గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ వివాదాలు సృష్టించి.. వాటితో చ‌లి కాచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అంతేకానీ.. విప‌క్ష నాయ‌కుడిగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు.. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్ర‌యోజ‌నాలపై అధిక దృష్టి సాధించట్లేదు అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్రాన్ని త‌న ఎంపీల‌తో ప్ర‌శ్నించేలా చేసి.. రావాల్సినవి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తే.. జ‌గ‌న్ ఇమేజ్ పెరుగుతుంది. కానీ, ఆయ‌న పొలిటిక‌ల్ చిచ్చులు.. ర‌చ్చ‌ల‌కు తెర‌దీసి.. వాటినే రాజ‌కీయాలు అనుకునే ప‌రిస్థితిలో `అక్క‌డే` ఉండిపోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.