టీడీపీ ఎమ్మెల్యే, హిందూపురం శాసన సభ్యుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ.. గురువారం అనూహ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన టీడీపీ పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అక్కడ విజిటర్స్ పాస్ తీసుకుని లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంటు స్పీకర్‌కు బాలయ్యను.. టీడీపీ సభ్యులు పరిచయం చేశారు.
తొలుత పార్లమెంటు సెంట్రల్ హాల్లో అన్నగారు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన(పురందేశ్వరి మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు) బాలయ్య.. భారీ పూల దండను సమర్పించారు. అనంతరం.. పార్టీ ఎంపీలతో కలిసి.. పార్లమెంటు ఆవరణలో కలియ దిరిగారు. ఈ సందర్భంగా సెంట్రల్ విస్టా(పార్లమెంటు) ప్రాజెక్టును చూసి ముగ్ధుడైన బాలయ్య కొన్ని సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం.. స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్నారు. కొద్ది సేపు ముచ్చటించారు. సెప్టెంబరులో ఏపీలో జరగనున్న మహిళా పార్లమెంటు విషయాన్ని ఆయనకు చెప్పారు.
దీనికి తాను హాజరు అవుతున్నట్టు ఓం బిర్లా కూడా చెప్పారు. ఈ సందర్భంగా.. బాలయ్య టీడీపీ ఎంపీలతో మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు పార్లమెంటులోనూ తాను అడుగు పెడతానని చెప్పారు. అది ఎంతో దూరంలో లేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్టీ సింబల్ సైకిల్ పై పార్లమెంటుకు రావడాన్ని బాలయ్య ప్రశంసించారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం అంటే.. ఇదే అంటూ.. కలిశెట్టి భుజం తట్టారు. తాను కూడా సైకిల్ ఎక్కి పార్లమెంటు ఆవరణలో ఫోటోలు దిగారు. ఇక, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారంటూ.. సభ్యులను ప్రశంసించారు. అదేవిధంగా బాలయ్య కేంద్ర మంత్రులను కలుసుకుని హిందూపురం సమస్యలను ప్రస్తావించారు. నిధులు విడుదల చేయాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates